AI Smartphone ఏఐ స్మార్ట్‌ఫోన్‌.. ఆహా అనిపిస్తుందా?

స్మార్ట్‌ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్‌, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్‌ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది.

Updated : 11 Feb 2024 21:24 IST

అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ అంచనాలు
ఈనాడు -  హైదరాబాద్‌

స్మార్ట్‌ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్‌, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్‌ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్‌ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్‌ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్‌ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మనం కొద్దిగా సమాచారం (ఫీడ్‌) అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్‌ (వీడియోలు/సమాచారం)ను అందించే సామర్థ్యం ఏఐ సాంకేతికత కలిగిన స్మార్ట్‌ఫోన్లకు ఉంటుందని మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, శామ్‌సంగ్‌ పేర్కొంటున్నాయి.

  • గూగుల్‌ విడుదల చేసిన పిక్సెల్‌ 8 స్మార్ట్‌ఫోన్‌లోని అల్గారిథమ్‌ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమేరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది.
  • వాయిస్‌ డిక్టేషన్‌, వేరే భాషల్లోకి తర్జుమా (ట్రాన్స్‌లేషన్‌) చేయడం వంటివి వాస్తవ సమయంలో చోటు చేసుకుంటాయి.
  • మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్‌ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్‌ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేసుకుంటాయి.

గెలాక్సీ ఎస్‌ 24 అల్ట్రా మోడల్‌లో

తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా ఫోన్‌లోని ఏఐ ప్రత్యేకతలు చూస్తే.. స్నాప్‌డ్రాగన్‌ జెన్‌ 3 ప్రాసెసర్‌, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది.

సర్కిల్‌ టు సెర్చ్‌: మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, ఆమె/అతను ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్‌ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సున్నా (సర్కిల్‌) కొట్టి సెర్చ్‌ చేస్తే.. ఆ వస్తువు/దుస్తులను తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు కూడా మనకు సెకన్లలో సెల్‌ఫోన్‌ తెరపై ప్రత్యక్షమవుతాయి.

ఏఐ లైవ్‌ ట్రాన్స్‌లేట్‌: మనం ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఆ మాటలను మనకు తెలుగులోనే ఈ ఫోన్‌ వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి వినిపిస్తుంది. వాస్తవ సమయంలోనే ఇది జరుగుతుంది కనుక.. వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు భాషా సమస్యను నివారించుకోవచ్చు. ఇదే పద్ధతిలో సంక్షిప్త సందేశాలు (ఎస్‌ఎంఎస్‌)లనూ తర్జుమా చేసి ఇతర భాషల వారికి చూపుతుంది.

కోరుకున్న విధంగా పొజిషన్‌ మార్చొచ్చు: గదిలో నిలబెట్టి ఒక వ్యక్తిని ఫొటో తీసినా, కావాల్సిన పొజిషన్‌లో.. వేరే ప్రాంతాల్లో/ఆకాశంలో ఉన్నట్లు.. ఊహలకు అనుగుణంగా ఫొటోలు రూపొందించుకోవచ్చు.

గ్రాఫిక్స్‌, నోట్‌ అసిస్ట్‌: గేమింగ్‌లో గ్రాఫిక్స్‌ను ఆకర్షణీయంగా మారుస్తుంది. అంతేకాదు ఏమైనా బృంద చర్చలో పాల్గొన్నప్పుడు, మనం కనుక పాయింట్స్‌ నోట్‌ చేసుకుంటే, వాటితో సమగ్ర నోట్‌ను (సమ్మరీ) నోట్‌ అసిస్ట్‌ సిద్ధం చేస్తుంది.

లైఫ్‌ షాట్‌: గెలాక్సీ ఎస్‌ 24 అల్ట్రా ఫోన్‌లోని లైఫ్‌ షాట్‌ను ఆన్‌చేసి పెడితే.. మన ఫోన్‌లోని కెమేరా దృష్టిలో పడిన అంశాలను వేర్వేరుగా చిత్రీకరించి, వీడియోలు.. భిన్న కంటెంట్‌ రూపంలో మనకు చూపుతుంది.


ఈ సేవలన్నీ ఉచితమేనా

ప్రస్తుతం ఖరీదైన మోడళ్లలోనే ఏఐ సేవలను దిగ్గజ కంపెనీలు అందిస్తున్నాయి. ఎందుకంటే చిప్‌/ప్రాసెసర్‌ తయారీ కంపెనీలు కూడా వీటిని అభివృద్ధి చేసేందుకు అధిక పెట్టుబడులు పెట్టడమే కాకుండా, ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కనుక, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే అంశాన్నీ కొట్టిపారేయలేమని పరిశ్రమ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే..

చాట్‌జీపీటీ వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారానే ఆకర్షణీయ ఫీచర్లను స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు అందించగలుగుతాయి. క్రమంగా స్థానిక పరిస్థితులకు అనువైన ఫీచర్లు పెరిగే కొద్దీ రుసుములూ నిర్ణయించే వీలుంది.

ఖరీదైన మోడళ్ల అమ్మకాలు పెరుగుతున్న క్రమంలోనే..: దేశీయ విపణిలో చూస్తే 2022, 2023 సంవత్సరాల్లో మొత్తం సెల్‌ఫోన్ల అమ్మకాలు, అంతకుముందు ఏడాది కంటే 10 శాతం క్షీణించాయి. అయితే రూ.50,000 కు మించి ఖరీదైన మోడళ్ల విక్రయాలు మాత్రం 75 శాతం వృద్ధిని సాధించాయి. అంటే సామాన్యులు ఫోన్‌ మార్చడంలో ఆచితూచి వ్యవహరిస్తుంటే, సంపాదనా శక్తి కలిగిన యువత, సంపన్నులు మాత్రం కొత్త ఫీచర్లు కలిగిన అధునాతన ఫోన్‌ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణి వల్లే కంపెనీలు కూడా ధైర్యం చేసి, ఖరీదైన స్మార్ట్‌ఫోన్లలో అధునాతన ఏఐ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇది క్రమంగా తదుపరి ధరల శ్రేణి ఫోన్లకూ మేలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని