వియత్నాంతో ఎలా?

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ మార్కెట్‌ భారత్‌దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్‌ డాలర్లకు  చేరింది.

Updated : 18 Feb 2024 09:41 IST

స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల్లో భారత్‌కు గట్టి పోటీ
వేగంగా స్పందిస్తేనే ఫలితాలు
వాటిపై నెగ్గాలంటే పన్నులు తగ్గాల్సిందే

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ మార్కెట్‌ భారత్‌దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్‌ డాలర్లకు  చేరింది. భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్నా.. ఉద్యోగాలు సృష్టించాలన్నా.. స్మార్ట్‌ఫోన్ల తయారీ చాలా కీలకం. అందుకే భారత్‌ను ఒక దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతుల కేంద్రంగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. యాపిల్‌, ఫాక్స్‌కాన్‌, శాంసంగ్‌లకు ఆహ్వానం పలుకుతోంది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ భారత్‌కు కంపెనీలు వచ్చి ఇక్కడ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసే విషయంలో కాస్త వెనకాడుతున్నాయి. చైనా నుంచి తమ ప్లాంట్లను ఇక్కడకు తరలించడానికి ఆలోచిస్తున్నాయి. మరో వైపు తక్కువ పన్నులతో వియత్నాం, మెక్సికో, థాయ్‌ల్యాండ్‌లు ఆయా కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మన దగ్గర పోటీకి సరితూగని పన్నులను ప్రస్తావిస్తూ.. ఆర్థిక శాఖకు ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సిద్ధం చేసిన ఒక లేఖ వెళ్లింది. కీలక తయారీ గమ్యస్థానాలతో పోలిస్తే మన వద్ద ఉన్న అధిక టారిఫ్‌ల కారణంగా తయారీ వ్యయాలు భారీగా ఉన్నాయని అందులో ఉన్నట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ పేర్కొంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో చైనా నుంచి కంపెనీలు బయటకు వెళ్లాలని అనుకుంటున్నాయి. అవి వియత్నాం, మెక్సికో, థాయ్‌ల్యాండ్‌లకు వెళ్లేలోగా మనం తగిన చర్యలు తీసుకోవాలని అందులో ఆయన కోరారు.

తయారీ ఇక్కడే కానీ..

భారత్‌లో తయారయ్యే ఫోన్లలో చాలా వరకు విడిభాగాలను స్థానికంగానే తయారు చేస్తున్నారు. అయితే హై ఎండ్‌ విడిభాగాలను చైనా నుంచి కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. స్థానిక తయారీదార్ల ప్రయోజనార్థం పెంచిన దిగుమతి పన్నులు కాస్తా ఈ కంపెనీల తయారీ ఖర్చులను పెంచుతున్నాయి. చైనా, వియత్నాంలు తమ ఎగుమతులను పెంచుకోవడం కోసం తక్కువ పన్నులను ఎలా తీసుకొచ్చాయో ఆ లేఖలో ప్రస్తావించారు. గతేడాది భారత స్మార్ట్‌ఫోన్‌ తయారీలో ఎగుమతుల వాటా 25 శాతంగానే ఉండగా.. చైనా 63% (270 బి.డాలర్లు), వియత్నాం 95% (40 బి. డాలర్లు)తో ముందున్నాయని చంద్రశేఖర్‌ వివరించారు.

యాపిల్‌, ఫాక్స్‌కాన్‌, షియోమీ ఉత్పత్తి పెంచినా

స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాలైన యాపిల్‌, ఫాక్స్‌కాన్‌, షియోమీలు ఇటీవలి కాలంలో భారత్‌లో ఉత్పత్తిని పెంచినా కూడా.. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీలో మన వాటా కేవలం 4 శాతంగానే ఉంది. 2029 కల్లా మన ఈ వాటాను 25 శాతానికి పెంచుకోవాలని భారత్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ కవర్ల వంటి విడిభాగాలపై 15% నుంచి 10 శాతానికి తగ్గించినా.. మిగతా పన్ను కోత విజ్ఞప్తులపై ఆర్థిక శాఖ అంగీకరించలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆ లేఖలో గుర్తు చేశారు.

పన్నుల భారం ఇదీ..

భారత్‌ ప్రస్తుతం ఛార్జర్లు, కొన్ని సర్క్యూట్‌ బోర్డులు, పూర్తి అసెంబ్లింగ్‌ అయిన ఫోన్లపై 20% పన్నును విధిస్తోంది. ఈ ఏడాదిలో ఈ పన్నును 15 శాతానికి తగ్గించాలని ఐటీ శాఖ కోరుతోంది. వియత్నాం, చైనాలయితే తమ ‘ప్రాధాన్యతా దేశాల’పై లేదా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు(ఎఫ్‌టీఏ) ఉన్న దేశాలపై 10 శాతానికి మించి విధించడం లేదని గుర్తు చేశారు. పన్నుల విషయంలో చైనా, వియత్నాంల తరహాలో ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోందని అన్నారు.

కంపెనీలు కోరుతున్నదీ అదే..

కెమేరాలు, యూఎస్‌బీ కేబుళ్లలో వాడే మరిన్ని విడిభాగాలపై పన్ను తగ్గించాలని ఇటీవలే షియోమీ కేంద్రాన్ని కోరింది. చైనా, వియత్నాం వంటి పోటీ దేశాల టారిఫ్‌లను పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఏటా 100 బిలియన్‌ డాలర్లకు పైగా మొబైల్‌ ఫోన్ల తయారీ, అందులో 50% ఎగుమతి చేయాలని భారత్‌ పెట్టుకున్న లక్ష్యాన్ని చేరాలంటే కచ్చితంగా కొత్త వ్యూహం అవసరమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని