ఎర్ర సముద్రంలో ఎదురుగాలి

మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా  ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.  

Updated : 18 Feb 2024 07:14 IST

కంపెనీలకు అనుకోని చిక్కులు, పెరిగిన ఖర్చులు
సరకు రవాణాలో తీవ్ర జాప్యం
త్రైమాసిక ఫలితాలపై ప్రభావం!
ఈనాడు - హైదరాబాద్‌

న దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా  ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.   ఇటీవల కాలంలో ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ వాణిజ్యం సమస్యాత్మకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఉంది. దీనికి తోడు సోమాలియా, తదితర దేశాలకు చెందిన సముద్ర దొంగల తాకిడి పెరిగింది. ఇప్పుడు అదనంగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌ అంతర్జాతీయ సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దీంతో సరుకుతో వెళ్తున్న నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. సకాలంలో గమ్యస్ధానాలకు చేరటం లేదు. ఎక్కడపడితే అక్కడ నౌకలు ఆగిపోతున్నాయి.

ఆదాయాలు ఆశించినంత పెరగలేదు

సరుకుతో వెళ్లిన నౌకలు తిరిగి రావటానికి ఎంత సమయం పడుతుందనేది స్పష్టం కావటం లేదు. దీనివల్ల సరకు రవాణా ఖర్చులు, బీమా వ్యయాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితి స్థానిక కంపెనీల ఆదాయాలు, లాభాలపై ప్రభావం చూపుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కొన్ని కంపెనీలు ఆశించిన స్థాయిలో ఆదాయాలు నమోదు చేయలేకపోయాయి. దీనికి ఎర్ర సముద్రంలోని పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్యంపై దాని ప్రభావం... ప్రధాన కారణాలని ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్న కంపెనీలకు ఆదాయాలు ఆశించిన విధంగా పెరగకపోవటం గమనార్హం.

ఏ కంపెనీలపై ప్రభావం అంటే..

స్పెషాలిటీ పైపులు, ట్యూబుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఏరోఫ్లెక్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయాలు ఈ మూడో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా పెరగలేదు. ఈ సంస్థ ఆదాయాల్లో 85 శాతం వరకూ ఎగుమతులే ఉండటం గమనార్హం. ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ సరకు రవాణా సమస్యాత్మకంగా మారినట్లు, అందువల్ల ఆదాయ అంచనాలను అందుకోలేకపోయినట్లు ఈ సంస్థ యాజమాన్యం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత మదుపరులకు వివరించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని, అయినప్పటికీ తగిన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఖర్చులు కూడా పెరిగినట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పోకర్ణ ఇంజినీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంది. నౌకల రాకపోకలు నిలిచిపోతున్నాయని, దీనివల్ల ఇతర దేశాలకు సరకు పంపించటం కష్టంగా మారిందని సంస్థ సీఈఓ పరస్‌ కుమార్‌ జైన్‌ త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం ‘కాన్ఫరెన్స్‌ కాల్‌’లో మదుపరులకు వివరించారు. అంతేగాక అటు వినియోగదార్లకు, ఇటు తమకు ఖర్చులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఐరోపా దేశాల నుంచి ఈ సంస్థ కొన్ని ముడిపదార్థాలు కూడా తెచ్చుకుంటుంది. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో తమపై రవాణా ఛార్జీల భారం అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు, దానికి తగ్గట్లుగా తాము సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎగుమతులు, దిగుమతులు అధికంగా ఉన్న పలు ఇతర కంపెనీలు సైతం ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అవసరమని ఆ వర్గాలు కోరుతున్నాయి.

రంగంలోకి వాణిజ్య శాఖ..

కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. వాణిజ్య శాఖ ఉన్నతాధికార వర్గాలు వివిధ ఇతర మంత్రిత్వ శాఖలతో, వర్తక సంఘాలతో సంప్రదింపులు చేపట్టాయి. ముఖ్యంగా భారీగా పెరిగిన ఫ్రైట్‌ (సరకు రవాణా ఛార్జీలు), బీమా ఖర్చుల వల్ల పరిశ్రమలపై ఏమేరకు భారం పడుతోంది, దీనికి ఏదైనా పరిష్కారం ఉందా... అనే కోణంలో వాణిజ్య శాఖ వర్గాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశం నుంచి వ్యాపార సంస్థలు, ఐరోపా దేశాలకు దాదాపు 80 శాతం ఎగుమతులు ఎర్ర సముద్రం ద్వారా నిర్వహిస్తున్న విషయం గమనార్హం. అందువల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందేమోనని ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని