అణు విద్యుత్‌లోకి రూ.2.20 లక్షల కోట్లు!

అణు విద్యుత్‌ రంగంలో 26.50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Published : 21 Feb 2024 07:26 IST

దిగ్గజ సంస్థలతో ప్రభుత్వ సంప్రదింపులు

దిల్లీ: అణు విద్యుత్‌ రంగంలో 26.50 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అణు విద్యుదుత్పత్తిని భారీగా పెంచడమే దీని వెనక ఉద్దేశమని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. అణు విద్యుత్‌ వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవు. ప్రస్తుతం చూస్తే, దేశీయంగా జరుగుతున్న మొత్తం విద్యుదుత్పత్తిలో అణు విద్యుత్‌ వాటా 2% కంటే తక్కువగానే ఉంది. అందుకే తొలిసారిగా ఈ రంగంలోకి ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెబుతున్నారు. దేశ విద్యుత్తు ఉత్పత్తిలో సంప్రదాయేతర ఇంధనాల ద్వారా జరుగుతోంది 42% కాగా, దీనిని 2030 కల్లా 50 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అణు విద్యుత్‌ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులు తప్పనిసరని అంచనా.

ఒక్కో సంస్థ సుమారు రూ.44,000 కోట్ల (5.30 బిలియన్‌ డాలర్లు) వరకు పెట్టుబడులు పెట్టేలా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పవర్‌, వేదాంతా, టాటా పవర్‌లతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికాలంగా ఈ సంస్థలతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ, న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌)లు పలు దఫాలుగా సంప్రదింపులు జరిపినట్లు వివరించింది. ఈ పరిణామాలపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ, ఎన్‌పీసీఐఎల్‌, టాటా పవర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పవర్‌, వేదాంతా స్పందించలేదు.

2040 కల్లా కొత్తగా 11,000 మె.వా. సామర్థ్యం

ప్రైవేట్‌ సంస్థలు కనుక ఈ పెట్టుబడులు పెడితే, 2040 కల్లా 11,000 మెగావాట్ల మేర అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం సమకూరుతుందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్‌ ప్లాంట్లను ఎన్‌పీసీఐఎల్‌ నిర్వహిస్తోంది. మరో 1,300 మెగావాట్ల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు పెట్టాలన్నది ఆ సంస్థ ప్రణాళిక.

ప్రైవేటు కంపెనీలు ఏం చేయాలంటే

ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థలు వస్తే, అవి అణు విద్యుత్‌ ప్లాంట్లు, స్థలం, నీటి కొనుగోళ్లు, ప్లాంట్ల రియాక్టర్‌ కాంప్లెక్స్‌ వెలుపల చేపట్టే నిర్మాణాల మీదనే పెట్టుబడులు పెడతాయని ఆ వర్గాలు తెలిపాయి. ప్లాంట్ల అభివృద్ధి, కార్యకలాపాలు, ఇంధన నిర్వహణ బాధ్యత హక్కులు ఎన్‌పీసీఐఎల్‌ చేతిలోనే ఉండాలన్నది ప్రతిపాదన. ఈ విద్యుత్‌ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ప్రైవేట్‌ కంపెనీలు ఆదాయాలను ఆర్జించే అవకాశం ఉంటుందని.. రుసుము తీసుకుని ఎన్‌పీసీఐఎల్‌ ఈ ప్లాంట్లను నడిపిస్తుందని ఆ వర్గాలు వివరించాయి. ఈ పెట్టుబడుల ప్రణాళిక అమల్లోకి రావాలంటే, అణు ఇంధన చట్టం- 1962లో ఎటువంటి సవరణలు చేయాల్సిన అవసరం లేదని, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ నుంచి అనుమతులు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు