అంతరిక్షంలో అంకురాల దూకుడే

అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్‌ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated : 23 Feb 2024 06:37 IST

ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు నేపథ్యం

దిల్లీ: అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్‌ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్షరంగ సంస్థలు, సరఫరా వ్యవస్థతో భారతీయ కంపెనీలు కలిసి పనిచేయడానికీ  ఈ నిర్ణయం దోహదం చేస్తుందంటున్నారు. శాటిలైట్లకు విడిభాగాలను తయారు చేసే విషయంలో 100% విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతులివ్వడం వల్ల.. విదేశీ కంపెనీలు, ప్రైవేటు సంస్థలను ఈ విభాగంలోకి ఆహ్వానించినట్లయింది.

  • ప్రస్తుతం శాటిలైట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, కార్యకలాపాల్లో ఎఫ్‌డీఐకి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. ఈ విధానాన్ని మార్చి.. శాటిలైట్‌ తయారీ, కార్యకలాపాలు, శాటిలైట్‌ డేటా ఉత్పత్తులు తదితరాల్లో ఆటోమేటిక్‌ మార్గం ద్వారా 74% వరకు ఎఫ్‌డీఐకి అనుమతి ఇచ్చారు. అంతకు మించిన పెట్టుబడులకు మాత్రం ప్రభుత్వ ఆమోదం అవసరం.
  • రాకెట్లు (లాంచ్‌ వెహికల్స్‌), అనుబంధ వ్యవస్థలు లేదా ఉప-వ్యవస్థల్లో ఆటోమేటిక్‌ మార్గం ద్వారా 49% ఎఫ్‌డీఐకి అనుమతినిచ్చారు. అంతకు మించితే ప్రభుత్వ అనుమతులు అవసరం.
  • శాటిలైట్‌ వ్యవస్థలు/ఉప-వ్యవస్థలు, విడిభాగాల తయారీ, గ్రౌండ్‌, వినియోగ విభాగాల్లో 100% వరకు విదేశీ పెట్టుబడులు ఆటోమేటిక్‌ రూట్‌లోనే పెట్టొచ్చు.

ప్రయోజనాలు ఎలాగంటే..

తాజా సడలింపుల వల్ల అంతరిక్ష రంగంలో వినియోగదారు విభాగానికి ఊతం లభిస్తుందని; ఐటీ/అనలిటిక్స్‌లో భారత్‌కున్న సహజ నైపుణ్యాలను మరింతగా ఉపయోగించుకుని దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చొచ్చని డెలాయిట్‌ పేర్కొంది. రాకెట్లు, శాటిలైట్‌ తయారీ- అసెంబ్లింగ్‌, డౌన్‌స్ట్రీమ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌లలో పెద్దగా అభివృద్ధి చెందని అంకుర వ్యవస్థకు ఇది బలాన్ని ఇచ్చినట్లవుతుందని తెలిపింది. విదేశీ కంపెనీలతో భారత అంతరిక్ష అంకురాలు భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా, సాంకేతికత బదిలీ జరిగి ఈ రంగంలో మెరుగైన వాతావరణం ఏర్పడగలదని నాంజియా ఆండర్సన్‌ ఇండియా డైరెక్టర్‌ మాయంక్‌ అరోరా అంటున్నారు. శాటిలైట్‌ విడిభాగాలకు గిరాకీ పెరుగుతున్న ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం మేలు చేయగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంలో దాదాపు 200కు పైగా అంకురాలు ఉన్నాయని అంచనా.

  • పరిశ్రమ అంచనాలు: అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత ప్రైవేటు రంగ వాటా 2% ఉండగా.. 2040కి ఇది 10 శాతానికి వృద్ధి చెందుతుంది.
  • దూసుకెళ్లిన షేర్లు: ప్రభుత్వ నిర్ణయంతో స్పేస్‌ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఎంటార్‌ టెక్నాలజీస్‌, డేటా ప్యాటర్న్స్‌ షేర్లు 6% వరకు పెరిగాయి. అపోలో మైక్రోసిస్టమ్స్‌, ఆజాద్‌ ఇంజినీరింగ్‌, పరాస్‌ డిఫెన్స్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, ఎల్‌ అండ్‌ టీ 1-2% వరకు లాభపడ్డాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని