Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే

సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి  వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు.

Updated : 29 Feb 2024 10:06 IST

32% కేటాయించిన దేశీయులు
నైట్‌ఫ్రాంక్‌ నివేదిక వెల్లడి

దిల్లీ: సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి  వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. తమ సంపదలో 32 శాతాన్ని దేశ, విదేశాల్లోని స్థిరాస్తులు/నివాసాలపైనే ఖర్చుపెడుతున్నారు.‘ది వెల్త్‌ రిపోర్ట్‌ 2024’ పేరిట విడుదల చేసిన నివేదికలో స్థిరాస్తి కన్సల్టెంట్‌ నైట్‌ఫ్రాంక్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదికలోని ముఖ్యాంశాలు..

 • దేశంలోని అల్ట్రా హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) అంటే 30 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.250 కోట్లు) అంత కంటే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు.. తమ సంపదలో 32 శాతాన్ని నివాస స్థిరాస్తిపైనే పెడుతున్నారు.
 • సగటున ఒక్కో సంపన్నుడు 2.57 ఇళ్లు కలిగి ఉన్నారు. 2023లో తమ అదనపు ఇళ్లను 28% మంది అద్దెకిచ్చారు.
 • 2024లో 12% మంది కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. గతేడాదీ ఇంతే మంది కొత్త ఇంటిని తీసుకున్నారు. అంతర్జాతీయంగా 2024లో 22% మంది మరో ఇంటిని సొంతం చేసుకున్నారు.
 • అగ్రగామి 10 విలాస నివాస మార్కెట్లలో ముంబయి కూడా ఉంది. ఈ జాబితాలో మనీలా(26% వృద్ధి) అగ్రగామిగా ఉండగా.. దుబాయ్‌(16%) రెండో స్థానానికి దిగి వచ్చింది. బహమాస్‌(15%), అల్గేర్వ్‌(12.3%), కేప్‌ టౌన్‌(12.3%) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
 • 2022లో దిల్లీ 77వ ర్యాంకులో ఉండగా.. 4.2% వృద్ధితో 37వ స్థానానికి చేరింది. 2.2% వృద్ధితో బెంగళూరు కూడా 63వ స్థానం నుంచి 59కి చేరింది.
 • 100 నివాస మార్కెట్లలో 80 సానుకూల వృద్ధిని కనబరచాయి.
 • అమెరికా(3.6%)తో పోలిస్తే ఆసియా పసిఫిక్‌(3.8%) బలంగా కనిపిస్తోంది.

విలాస వస్తువులపైనా..

సంపన్నులంటే గుర్తుకొచ్చేదే విలాస వస్తువులు. వీరు తమ వద్ద పెట్టుబడి పెట్టదగ్గ సంపదలో 17 శాతాన్ని విలాస (లగ్జరీ) వస్తువులపై వెచ్చిస్తున్నారు. వాచీలు, కళాఖండాలు, ఆభరణాలపై ఖర్చు చేస్తున్నారని నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడించింది. క్లాసిక్‌ కార్లు, లగ్జరీ హ్యాండ్‌బాగ్‌లు, వైన్‌, అరుదుగా లభించే విస్కీ, ఫర్నీచర్‌, వజ్రాలు, నాణేలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్త ధోరణిని పరిశీలించినప్పుడు విలాస వాచీలు తొలిస్థానంలో ఉండగా.. క్లాసిక్‌ కార్లు రెండో స్థానంలో ఉన్నాయి.

2023లో కళాఖండాల్లో పెట్టుబడులు 11% ప్రతిఫలాన్ని ఇవ్వగా.. 10 ఏళ్ల కాలానికి అరుదుగా లభించే విస్కీ దాదాపు 280% ప్రతిఫలాన్ని ఇచ్చిందని నైట్‌ ఫ్రాంక్‌ లగ్జరీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇండెక్స్‌ పేర్కొంది.

అయిదేళ్లలో 50% పెరగనున్న సంపన్నులు

 • గతేడాదిలో 13,263 మంది
 • అంతర్జాతీయంగా 6.26 లక్షల పైమాటే

భారత్‌లో సంపన్నుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో 6% పెరిగి 13,263కు చేరింది. అయిదేళ్లలో అంటే 2028 కల్లా వీరి సంఖ్య 50.1% పెరిగి 19,908కు చేరుతుందని నైట్‌ఫ్రాంక్‌ అంటోంది. 2024లోనూ తమ సంపద పెరుగుతుందని 90% మంది యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు భావిస్తున్నారు. సంపద వృద్ధి 10% కంటే ఎక్కువే ఉంటుందని 63% మంది అంచనా వేస్తున్నారు.

 • అంతర్జాతీయంగా చూస్తే వచ్చే అయిదేళ్లలో 28.1% వృద్ధితో 8,02,891 మంది సంపన్నులు అవుతారని ఆ సంస్థ పేర్కొంది. 2023లో 4.2% వృద్ధితో వీరి సంఖ్య 6,26,619కి పెరిగింది.
 • సంపన్నుల సంఖ్య వృద్ధి విషయంలో తుర్కియే(9.7%) అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత అమెరికా(7.9%), భారత్‌(6.1%), దక్షిణకొరియా(5.6%), స్విట్జర్లాండ్‌(5.2%) ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని