కొత్త విధానం.. కోత ఖాయం!

ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి.

Updated : 29 Feb 2024 16:49 IST

ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు దామాషా పద్ధతి
ఇంతకు ముందు నిర్ణయించిన దాని కంటే 30-35% తగ్గనున్న పింఛను
డిమాండ్‌ నోటీసులు, పీపీవోల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: ఈపీఎఫ్‌వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. పింఛను అర్హత వేతనం (మూలవేతనం+డీఏ) ఖరారుపై ఈపీఎఫ్‌వో కేంద్ర కార్యాలయం తాజాగా స్పష్టత ఇవ్వడంతో పాటు దామాషా పద్ధతిలో (పార్ట్‌-1, 2) పింఛను లెక్కించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు రావడంతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో కదలిక వచ్చింది. ఒకే పార్టు కింద లెక్కించే విధానంతో పోలిస్తే.. దామాషా పద్ధతిలో వచ్చే పింఛను 30-35 శాతానికి పైగా తగ్గిపోనుంది. దీంతోపాటు చందాదారుడిగా 20 ఏళ్లు పూర్తి చేసిన వారికి ఇచ్చే రెండేళ్ల బోనస్‌ను పార్ట్‌-బి సర్వీసులో కలిపి లెక్కించడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా 17.48 లక్షల దరఖాస్తులు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛను కోసం దేశవ్యాప్తంగా 17,48,768 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు ఉద్యోగ విరమణ చేసిన వారు 4,10,039 మంది, ఆ తేదీ తరువాత రిటైరైన/కానున్న వారు 13,38,729 మంది. వీరంతా దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా.. పరిష్కారం కాలేదు. కొందరికి ఈపీఎఫ్‌వో డిమాండ్‌ నోటీసులు జారీచేసి బకాయిలు వసూలు చేసినా.. తరువాత కదలిక లేదు. అర్హత వేతనం, పింఛను లెక్కింపు విధానంపై స్పష్టత లేకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. వారం రోజుల కిందట ఇది ఖరారు కావడంతో దరఖాస్తుదారులకు డిమాండ్‌ నోటీసులు జారీ అవుతున్నాయి. ఇప్పటికే ఈపీఎస్‌ బకాయిలు జమ చేసిన వారికి పింఛను పత్రాలు విడుదల అవుతున్నాయి. 1995 నవంబరు 15 తరువాత సర్వీసులో చేరిన వారికి పార్ట్‌-బి, పార్ట్‌-సి కింద.. అంతకు ముందు నుంచీ ఈపీఎఫ్‌ చందాదారుడిగా ఉన్నవారికి పార్ట్‌-ఎ, పార్ట్‌-బి, పార్ట్‌-సి కింద పింఛను లెక్కిస్తున్నారు.

తొలుత ఖరారు చేసిన లెక్కింపు విధానమిదీ..

అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్‌వో 2023లో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2014 సెప్టెంబరు 1వ తేదీకి ముందు రిటైరైన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా పింఛను లెక్కించాలి. ఆ తేదీ తరువాత ఉద్యోగ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం, పూర్తి సర్వీసు ఆధారంగా గణించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని