Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం

విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి.

Updated : 10 Mar 2024 08:58 IST

దిగివస్తున్న వాహన ధరలు
ఫేమ్‌-2 సబ్సిడీ గడువు ముగుస్తున్న ఫలితం
ఉత్పత్తి వ్యయాలు తగ్గడమూ కలిసొస్తోంది
ఈనాడు - హైదరాబాద్‌

విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. అదే సమయంలో పెట్రోలు స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు రూ.1 లక్ష దరిదాపుల్లోనే లభిస్తున్నాయి. దీంతో విద్యుత్తు వాహనాల అమ్మకాలు ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తూ వచ్చాయి. ఇపుడు విద్యుత్తు ద్విచక్ర వాహన కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఒక్కో వాహనంపై రూ.25,000 వరకు రాయితీ ఇస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్‌ తన ఎస్‌1 శ్రేణి స్కూటర్ల ధరను రూ.25,000 వరకు తగ్గించింది. ఎస్‌1 ప్రో, ఎస్‌1 ఎయిర్‌, ఎస్‌1 ఎక్స్‌+ వాహనాలకు ఈ తగ్గింపు వర్తిస్తోంది. దీనివల్ల రూ.79,999 నుంచి రూ.1,29,999 షోరూమ్‌ ధరకు ఈ వాహనాలు లభిస్తున్నాయి. హీరో మోటోకార్ప్‌ అనుబంధ విడా కూడా తమ స్కూటర్ల ధరలను తగ్గించింది. విద్యుత్తు కార్ల కంపెనీలూ ఇదే బాట పట్టడం ఆసక్తికర అంశం. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా, ఎంజీ మోటార్స్‌.. తదితర సంస్థలు తమ విద్యుత్తు కార్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి.

కారణాలివీ..

విద్యుత్తు వాహనాల ధరలు దిగిరావడానికి ‘టెక్నాలజీ మార్పులు, అధిక సంఖ్యలో వాహనాలు ఉత్పత్తి చేస్తున్నందున వ్యయాలు తగ్గడం’ వంటివి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న ఫేమ్‌- 2 సబ్సిడీ గడువు ఈ నెలాఖరుతో తీరిపోతోంది. కేంద్రం ప్రభుత్వం ఈ పథకం కింద రూ.7,048 కోట్లు కేటాయించింది. విద్యుత్తు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల కొనుగోలుదార్లకు రాయితీ ఇచ్చేందుకు ఈ నిధులు ఉపకరిస్తున్నాయి. గడువు లోపు ఈ సబ్సిడీ వల్ల ప్రయోజనం పొందే లక్ష్యంతో విద్యుత్తు వాహనాల తయారీ సంస్థలు కూడా ఇప్పుడు వాహనాల ధర తగ్గింపునకు సిద్ధపడుతున్నాయి. తమ వాహనాల నిల్వలను మార్చి నెలాఖరు లోగా ఖాళీ చేసేందుకు దీన్నొక అవకాశంగా భావిస్తున్నాయి. ఈ పరిణామాలు వినియోగదార్లకు మేలు చేస్తున్నాయి. తక్కువ ధరలో విద్యుత్తు వాహనాన్ని సొంతం చేసుకునే వీలు కలుగుతోంది.

అమ్మకాల్లో అనూహ్య వృద్ధి

విద్యుత్తు వాహనాల పరిశ్రమ సమీప భవిష్యత్తులో అనూహ్య వృద్ధి సాధించబోతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సొసైటీ ఆఫ్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఎస్‌ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022-23లో అన్ని రకాల విద్యుత్తు వాహనాల (2- 3 వీలర్స్‌, కార్లు, బస్సులు) అమ్మకాలు 11.79 లక్షల మేరకు నమోదయ్యాయి. 2023-24లో ఇప్పటికే 13.77 లక్షల విద్యుత్తు వాహనాల అమ్మకాలు జరిగాయి. విద్యుత్తు టూ-వీలర్లు, బస్సుల కంటే ఆటోలు, కార్ల విభాగంలో అధిక వృద్ధి కనిపిస్తోంది. విద్యుత్తు ద్విచక్ర వాహన అమ్మకాలు 2022-23లో 7.28 లక్షలైతే, 2023-24లో ఫిబ్రవరి నెలాఖరు వరకూ 7.37 లక్షల వాహనాల అమ్మకాలు నమోదయ్యాయి. ధరలు తగ్గించినందున మార్చిలో అమ్మకాలు బాగా పెరుగుతాయని, తత్ఫలితంగా 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ద్విచక్ర వాహన అమ్మకాల్లో ఆకర్షణీయ వృద్ధి కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

2027 నాటికి ఎన్నో మార్పులు

సంప్రదాయ పెట్రోలు, డీజిల్‌ వాహనాల స్థానంలో విద్యుత్తు వాహనాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నందున, ఉత్పత్తి వ్యయాలు వచ్చే కొన్నేళ్లలో బాగా తగ్గుతాయని, దానివల్ల పెట్రోలు, డీజిల్‌ వాహనాల ధరకే విద్యుత్తు వాహనాలు లభిస్తాయని గార్ట్‌నర్‌ అనే పరిశోధనా సేవల సంస్థ అంచనా వేసింది. దీనివల్ల 2027 నాటికి విద్యుత్తు వాహనాల ధరలు బాగా దిగివచ్చే అవకాశం ఉందని తాజా నివేదికలో వివరించింది. ఉత్పత్తి ప్రక్రియలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు వీలు కల్పిస్తాయని పేర్కొంది. పెట్రోలు, డీజిల్‌ వాహనాల ఉత్పత్తి వ్యయం ఎక్కువగా, విద్యుత్తు వాహనాల ఉత్పత్తి వ్యయం తక్కువగా మారే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేసింది.

మరమ్మతులతోనే సమస్య..

అమెరికాలో టెస్లా అందుబాటులోకి తెచ్చిన ‘గిగాక్యాస్టింగ్స్‌’ ప్రవేశంతో విద్యుత్తు వాహనాల ఉత్పత్తి తీరుతెన్నులు మారిపోతున్నాయి. ఎంతో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో లక్షల సంఖ్యలో విద్యుత్తు వాహనాలు ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఈ సాంకేతికత వల్ల లభిస్తోంది. అయితే విద్యుత్తు వాహనాల మరమ్మతులు ఖరీదైన వ్యవహారంగా మారడం సమస్యగా ఉందని గార్ట్‌నర్‌ పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్తు వాహనానికి ప్రమాదం జరిగితే, మరమ్మతు చేయడానికి అధికంగా ఖర్చవుతుందని తెలిపింది. వాహన కొనుగోలు ధరతో పాటు మరమ్మతు ఖర్చు తక్కువగా ఉంటే విద్యుత్తు వాహనాలకు అధిక ఆదరణ లభిస్తుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని