అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?

అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్‌ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్‌ వర్గాలు అంటుంటాయి.

Updated : 31 Mar 2024 10:27 IST

గతంతో పోలిస్తే పరిమిత ప్రభావమే

అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్‌ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్‌ వర్గాలు అంటుంటాయి. అది ఒక విధంగా నిజమే. అక్కడి మార్కెట్ల తీరును బట్టి, మరుసటి రోజు మన మార్కెట్లు కదలాడిన రోజులు ఎన్నో. అయితే ఇటీవలి కాలంలో ఆ ప్రభావం పరిమితంగా ఉంటోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ ఏడాదిలో 3 సార్లు రేట్ల కోతను చేపడతామనే సంకేతాలిచ్చింది. తదుపరి అక్కడి మార్కెట్లు కొంత పెరిగాయి. అక్కడి రేట్ల కోత ప్రభావం మన మార్కెట్లపై ఎలా ఉండొచ్చనే అంశంపై విశ్లేషణలు సాగుతున్నాయి. అక్కడ వడ్డీరేట్ల ప్రభావం ఇలా..

  • ఫెడ్‌ కీలక రేట్ల ఆధారంగానే అమెరికాలోని బ్యాంకులు తమ నగదు నిల్వలను సర్దుబాటు చేసుకుంటాయి. రోజూ ఉదయం తమ వద్ద ఉన్న నగదు నిల్వలను చూసుకుని.. తమ అవసరాలను అంచనా వేస్తాయి. తక్కువ నిధులు ఉన్నాయనిపిస్తే.. ఇతర బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని.. తర్వాతి రోజు వడ్డీతో చెల్లిస్తాయి.
  • పెద్ద కంపెనీలు కూడా తమ వృద్ధి ప్రణాళికల కోసం/రోజువారీ కార్యకలాపాల కోసం తీసుకునే రుణ వ్యయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాయి. వడ్డీ రేట్లు తగ్గితే, ‘అంతకుముందు అధిక వడ్డీతో తీసుకున్న రుణాలను తీర్చేయడానికి కొత్త రుణాలు తీసుకునే వెసులుబాటు కంపెనీలకు కలుగుతుంది. దీంతో కంపెనీల లాభాల మార్జిన్‌ పెరుగుతుంది. తద్వారా ఆదాయాలూ మెరుగవుతాయి. వడ్డీ భారం తగ్గినప్పుడు, సహజంగానే వినియోగదార్ల వ్యయాలూ పెరుగుతాయి. తద్వారా కంపెనీల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుంది. ఇదో చక్రంలాగా మారి కార్పొరేట్‌ ఫలితాలపై సానుకూల ప్రభావం పడుతుంది. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో షేర్లు పరుగులు తీసే అవకాశం ఉంటుంది.

మన దేశంలో ప్రభావం ఇలా

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినపుడు, అక్కడి బాండ్లపై అధిక ప్రతిఫలం లభిస్తుంది కనుక, మనలాంటి వర్థమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులను అక్కడి పెట్టుబడిదార్లు తరలించే వీలుంది. బాండ్లతో పోలిస్తే, మన మార్కెట్లలోనే మంచి ప్రతిఫలాలు వస్తున్నాయనుకుంటే మాత్రం పెట్టుబడులను ఉపసంహరించరు. గత ఏడాదంతా జరిగింది అదే. ఆ సమయంలో అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినా, మన స్టాక్‌ మార్కెట్లోకి భారీ స్థాయిలో విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది వడ్డీరేట్లను ఫెడ్‌ తగ్గిస్తే..అమెరికాలో వడ్డీరేట్లలో కోత విధిస్తే, బాండ్లపై ప్రతిఫలం తగ్గుతుంది. అందువల్ల అధిక ప్రతిఫలం ఏ దేశంలో లభిస్తుందో చూసి, అక్కడకు తమ పెట్టుబడులను మదుపర్లు మళ్లిస్తుంటారు. రేట్ల కోత సమయానికి మన ఈక్విటీ మార్కెట్లు రాణిస్తుంటే, ఇక్కడకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని అనుకోవాలి. అయితే మార్కెట్‌ నిపుణులు మాత్రం మరీ బలమైన బులిష్‌ ధోరణి ఏమీ కనిపించకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే రేట్ల కోత ప్రకటనల ప్రభావం వల్ల మన మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు ముందుగానే వచ్చాయనే వాదనా ఉంది. అయినా కూడా భారీ లాభాలు రాకున్నా, మన మార్కెట్లకు ఎంతో కొంత సానుకూలమే అవుతుందని, ముందుకే వెళ్లొచ్చని అంటున్నారు. జూన్‌, జులైలోగా అమెరికాలో కీలక రేట్లలో కోత జరగకపోతే మాత్రం స్వల్పకాలంలో మన మార్కెట్లు నిరుత్సాహానికి గురికావచ్చని అంటున్నారు.

మన మదుపర్లు ఏం చేయాలి?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడి, కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు జూన్‌ వరకు సమయం ఉన్నందున, మదుపర్లు ఎంపిక చేసిన స్క్రిప్‌ల ఆధారంగానే అడుగులు వేయడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రుతు పవనాలపై అంచనాలు, పరపతి విధాన ధోరణిలో మార్పులను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. స్వల్పకాలానికైతే చాలా తక్కువ శ్రేణిలోనే మార్కెట్లు చలించొచ్చని.. అందుకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడం మేలని చెబుతున్నారు.


పసిడి దారెటు?

అమెరికా వడ్డీ రేట్లకు, పసిడి ధరలకు లంకె ఉంటుంది. రేట్లు తగ్గినపుడు సహజంగానే బాండ్లలోని పెట్టుబడులు కాస్తా రక్షణాత్మకంగా భావించే పసిడిలోకి మళ్లుతుంటాయి. అంతర్జాతీయ అనిశ్చితులు కూడా పసిడి ధర పెరిగేందుకు దోహదం చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పసిడి ఔన్సు (31.10 గ్రాముల) ధర 2250 డాలర్లను అధిగమిస్తే.. 2400 డాలర్లకు చేరొచ్చనే అంచనాలూ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని