7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్‌ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?

Anant Ambani - Radhika Merchant: అనంత్‌, రాధికా మర్చంట్‌ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది.

Updated : 04 Mar 2024 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ (Anant-Radhika).. ఇప్పుడు పరిచయం అక్కర్లేని పేర్లు. వీరి పెళ్లి గురించే దేశమంతా చర్చించుకుంటోంది. విదేశీ ప్రముఖుల రాక.. బాలీవుడ్‌ ప్రముఖుల ఆటపాటలతో మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రీవెడ్డింగ్‌ ఆ రేంజ్‌లో జరిగింది మరి. ముందస్తు వేడుకలే ఇలాఉంటే.. ఇక పెళ్లి ఏ స్థాయిలో ఉంటుందోనంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. పనిలో పనిగా అంబానీల ఇంటికొస్తున్న ఈ చిన్న కోడలెవరోనని ఆరా తీయడం మొదలుపెట్టారు.

  • అంబానీల ఇంటికి రాధికా మర్చంట్‌ కోడలు కాబోతోందంటూ కొన్నేళ్లుగా ప్రచారంలో ఉంది. మర్చంట్‌ కుటుంబానికి, అంబానీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఇదే అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల మధ్య ప్రేమకు దారితీసిందంటారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నా.. విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వచ్చారు.
  • 2018లో ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమల్‌ల వివాహ వేడుక సమయంలోనే రాధిక పేరు వినిపించింది. 2019లో ఆకాశ్‌-శ్లోకల పెళ్లి సమయంలో రాధిక అంబానీ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం, ప్రతీ వేడుకలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, సంగీత్‌ వేడుకలో అనంత్‌కు జంటగా డ్యాన్స్‌ చేయడం, ఫ్యామిలీ ఫొటోల్లోనూ కనిపించడంతో నీతా అంబానీకి కాబోయే చిన్న కోడలంటూ ప్రచారం ఊపందుకుంది. 
  • అనంత్‌-రాధిక కలిసి దిగిన కొన్ని ఫొటోలు కూడా అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. 2022లో అధికారికంగా ఇరు కుటుంబాలు వీరి వివాహాన్ని ధ్రువీకరించాయి. 2023 జనవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జులైలో వివాహం జరగనుంది.
  • రాధికా మర్చంట్‌ తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థం కావడం లేదని ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో అనంత్‌ అంబానీ అన్నారు. రాధికను చూస్తే తనలో తుపాను, సునామీ మొదలవుతాయని చెప్పారు. గత ఏడేళ్లుగా రాధిక తనతో ఉన్నా.. రోజూ చూస్తున్నా.. నిన్ననే చూసినట్లు ఉంటుందన్నారు.

వ్యాపారం.. దాతృత్వం

  • ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో అనంత్‌ తన పాఠశాల విద్యను పూర్తి చేశారు. అమెరికాలో మేనేజ్‌మెంట్‌ కోర్సులో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. 
  • ముకేశ్‌ అంబానీ జియో బాధ్యతలను ఆకాశ్‌కు అధికారికంగా అప్పగించగా.. రిటైల్‌ వ్యవహారాలు ఈశాకు అప్పగించారు. అనంత్‌కు న్యూ ఎనర్జీ వ్యవహారాల బాధ్యతలను అప్పగిస్తున్నట్లు కంపెనీ ఏజీఎంలో ముకేశ్‌ ప్రకటించారు.
  • వ్యాపారంతో పాటు దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుంటారు అనంత్‌. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
  • వన్య ప్రాణుల సంరక్షణ కోసం ‘వంతారా’ పేరిట 3 వేల ఎకరాల్లో కృత్రిమ అడవిని సృష్టించారు. ఆ ఆలోచన అనంత్‌దే. గాయపడిన జంతువుల్ని కాపాడటం, చికిత్స చేయడం సహా వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడమే దీని ప్రధాన ఉద్దేశం.

అత్తకు తగ్గ కోడలు..

  • ‘ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌’ సంస్థ సీఈఓ వీరెన్‌ మర్చంట్‌-శైలజా మర్చంట్‌ల కుమార్తె రాధిక. తండ్రి వీరెన్‌ మర్చంట్‌ హెల్త్‌కేర్‌ సీఈఓగా, వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
  • న్యూయార్క్‌ యూనివర్సిటీలో పాలిటిక్స్‌, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన రాధిక.. ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా కొన్నాళ్లు పనిచేశారు. ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సంస్థలో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు.
  • రాధికకు శాస్త్రీయ నృత్యం అంటే చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆ మక్కువతోనే ప్రముఖ డ్యాన్సర్‌ భావనా థాకర్‌ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకుందామె.
  • రాధికకు అరంగేట్రం కార్యక్రమం కూడా 2022లో ముకేశ్‌-నీతా ఘనంగా నిర్వహించారు. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌ ఇందుకు వేదికైంది. ముకేశ్‌ భార్య నీతా అంబానీ కూడా క్లాసికల్‌ డ్యాన్సర్‌. దీంతో అత్తకు తగ్గ కోడలు అని అందరూ ప్రశంసించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని