Hyundai: హ్యుందాయ్‌ చేతిలోకి జనరల్‌ మోటార్స్‌ ప్లాంట్‌

‘జనరల్‌ మోటార్స్‌ ఇండియా’కు చెందిన కార్ల ప్లాంట్‌ను హ్యుందాయ్‌ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 16 Aug 2023 18:43 IST

ముంబయి: మహారాష్ట్రలోని జనరల్‌ మోటార్స్‌ ఇండియాకు చెందిన తాలెగావ్‌ ప్లాంట్‌ను కొనుగోలుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ బుధవారం తెలిపింది. ఈ ప్లాంట్‌లో తయారీ కార్యకలాపాలను 2025లో ప్రారంభించాలని యోచిస్తున్నట్లు హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో హ్యుందాయ్‌ ఇండియా తమిళనాడులో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని చేపట్టడానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. శ్రీపెరంబుదూర్‌ (చెన్నై), తాలెగావ్‌ ప్లాంట్‌లలో సంవత్సరానికి 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని తమ వాహన తయారీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని హ్యుందాయ్‌ తెలిపింది.

జనరల్‌ మోటార్స్‌ ఇండియా తాలెగావ్‌ ప్లాంట్‌ ప్రస్తుతం 1.30 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ఇప్పటికే ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 7.50 లక్షల యూనిట్ల నుంచి 8.20 లక్షల యూనిట్లకు పెంచింది. కాబట్టి, జనరల్‌ మోటార్స్‌ కంపెనీ సామర్థ్యంతో సుమారు 10 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయడానికి ఈ ఒప్పందం పునాది అవుతుందని హ్యుందాయ్‌ పేర్కొంది.

జనరల్‌ మోటార్స్‌ దేశంలో 20 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించిన అనంతరం గ్లోబల్‌ రీస్ట్రక్చరింగ్‌ చర్యల్లో భాగంగా, 2017లో భారత్‌లో కార్ల అమ్మకాలను నిలిపివేసింది. ఈ ప్లాంట్‌ను చైనీస్‌ కార్ల తయారీ సంస్థ గ్రేట్‌ వాల్‌ మోటార్స్‌కు విక్రయించేందుకు అమెరికన్‌ ఆటోమేకర్లు గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, చైనీస్‌ కారు తయారీదారులు భారత మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళికలను విరమించుకోవడంతో గత సంవత్సరం ఈ ఒప్పందం వీగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు