Infosys: ఇన్ఫీ ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీస్‌కు రావాల్సిందే..!

Infosys on Workfrom home: ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఇన్ఫీ కూడా సిద్ధమైంది. త్వరలో వారానికి మూడు రోజుల హాజరును తప్పనిసరి చేయనుంది.

Published : 12 Dec 2023 15:40 IST

Infosys | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఇన్ఫోసిస్‌ (Infosys) సిద్ధమైంది. వారానికి మూడు రోజులు ఇకపై ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా విభాగాధిపతులు ఇ-మెయిల్‌ చేసినట్లు సమాచారం. ‘‘వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసుకు రావాలి. అతి త్వరలో ఇది తప్పనిసరి కానుంది’’ అని ఇ-మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిసింది. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి దీన్నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు సమాచారం.

కొవిడ్‌ తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు స్వస్తి చెప్పిన ఐటీ కంపెనీలు.. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి. అయినప్పటికీ ఆశించిన మేర ఫలితం కనిపించడం లేదు. ఇటీవల హైబ్రిడ్‌ విధానాన్ని ఉల్లంఘించిన పలువురు ఉద్యోగులకు విప్రో వార్నింగ్‌ ఇచ్చింది. జనవరి నుంచి వారానికి మూడు రోజుల చొప్పున ఆఫీసుకు రావాల్సిందేనని ఉద్యోగులకు స్పష్టంచేసింది. మరోవైపు టీసీఎస్‌ మునుపటిలా పూర్తిస్థాయిలో ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నం చేస్తోంది.

రిలయన్స్‌-డిస్నీ విలీనం ఇక లాంఛనం?

ఉద్యోగులు కార్యాలయాలకు వస్తేనే ఉత్పాదకత పెరుగుతుందని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. దీనికి తోడు కొన్ని కార్యాలయాలు పూర్తిగా ఉద్యోగులు లేక ఖాళీగా కనిపిస్తుండడంపై ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో అర్హత కలిగిన ఉద్యోగులు నెలలో 9 రోజులు చొప్పున ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు ఉండేది. ఒకవేళ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే కొవిడ్‌కు ముందునాటి హాజరు విధానం తిరిగి అమల్లోకి రానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని