RIL- Disney: రిలయన్స్‌-డిస్నీ విలీనం ఇక లాంఛనం?

Reliance, Disney merger: రిలయన్స్‌, డిస్నీ విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నాటికి విలీన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Published : 12 Dec 2023 13:42 IST

Reliance, Disney merger | ఇంటర్నెట్ డెస్క్: మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో మరో విలీనానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance), వాల్ట్‌ డిస్నీకి చెందిన డిస్నీ ఇండియా (Disney)కు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనానికి సంబంధించి చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ఆంగ్లపత్రిక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ ఓ కథనం ప్రచురించింది.

ఇరు సంస్థల విలీనం అనంతరం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ యాజమాన్యం నియంత్రణ వాటా అయిన 51 శాతంతో అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా నిలుస్తుంది. అంతేకాదు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో అతిపెద్ద సంస్థగానూ అవతరించనుంది. అటు డిస్నీకి విలీన సంస్థలో 49 శాతం వాటా ఉండనుట్లు తెలుస్తోంది. రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18కి అనుబంధ సంస్థగా విలీన సంస్థను ఏర్పాటు చేయనున్నారని సమాచారం. యాజమాన్య వాటా కోసం రిలయన్స్‌ నగదు రూపంలో చెల్లించనుంది. నగదు మొత్తం, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది.

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటున్నారా? ఈ 7 అంశాలు తెలుసుకుందాం..!

విలీన సంస్థ బోర్డులో అటు రిలయన్స్‌, ఇటు డిస్నీకి సమాన ప్రాతినిధ్యం ఉండబోతోందని తెలుస్తోంది. చెరో సంస్థ నుంచి ఇద్దరేసి డైరెక్టర్లు ఉండనున్నారు. అలాగే వయాకామ్‌లో అతిపెద్ద వాటాదారు అయిన బోధి ట్రీకి బోర్డులో చోటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి విలీనం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం స్టార్‌ ఇండియాకు 77 ఛానళ్లు ఉండగా.. వయాకామ్‌కు 38 ఛానళ్లు ఉన్నాయి. డిస్నీకి డిస్నీ+ హాట్‌స్టార్‌, రిలయన్స్‌కు జియో సినిమా స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. విలీన ప్రతిపాదనపై ఇరు సంస్థలు అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని