Credit Suisse: అప్పుడు లేమన్‌ బ్రదర్స్‌.. ఇప్పుడు క్రెడిట్‌ సూయిజ్‌?

క్రెడిట్‌ సూయిజ్‌ దివాలా అంచులకు చేరుకుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే 2008 నాటి లేమన్‌ బ్రదర్స్‌ తరహా సంక్షోభం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Updated : 06 Oct 2022 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు రష్యా-ఉక్రెయిన్‌ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటే ద్రవ్యోల్బణం రూపంలో మరో సవాల్‌ వచ్చిపడింది. దీన్ని పరిష్కరించేందుకు చేపట్టిన వడ్డీరేట్ల పెంపు వంటి చర్యలు ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్నాయి. సరిగ్గా ఈ తరుణంలో సామాజిక మాధ్యమాలు, అంతర్జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ అంశం ఇప్పుడు యావత్తు ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది.

మరో లేమన్‌ బ్రదర్స్‌ కానుందా?

2008లో లేమన్‌ బ్రదర్స్‌ దివాలాతో ఆర్థిక సంక్షోభం తీవ్రమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత భారీ కుదుపునకు లోనైందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావొచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ సారి సంక్షోభం ‘క్రెడిట్‌ సూయిజ్‌’ బ్యాంక్‌ దివాలాతోనే మొదలు కాబోతోందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకున్న ఈ సంస్థ త్వరలోనే దివాలా తీయడం ఖాయమని అంటున్నారు. మరోవైపు అలాంటి పరిస్థితేమీ రాదని, క్రెడిట్‌ సూయిజ్‌ ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ కంపెనీ సీఈఓ సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు.

స్విట్జర్లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న క్రెడిట్‌ సూయిజ్‌ను 1856లో స్థాపించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల్లో ఒకటి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సంస్థ దివాలా తీస్తే యావత్తు ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని కొందరు వాదిస్తున్నారు. ఇంతకీ ఈ కంపెనీ ఇంతటి ప్రమాదపుటంచులకు ఎలా చేరింది? ఇది దివాలా తీస్తే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందా? చూద్దాం..

షేరు ఢమాల్‌..

కంపెనీని బయటి నుంచి పరిశీలిస్తే కొన్ని ఆందోళనకర అంశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కంపెనీ షేరు ధర అమాంతం పడుతూ వస్తోంది. సోమవారం ఒక్కరోజే 10 శాతం షేరు విలువ కోల్పోయింది. గత ఆరు నెలల్లో కంపెనీ మార్కెట్‌ విలువ 50 శాతం తగ్గింది.

సీడీఎస్‌ ప్రీమియం పైపైకి..

మరోవైపు ఈ కంపెనీ ‘క్రెడిట్‌ డీఫాల్ట్‌ స్వాప్స్‌ (CDS)’ ప్రీమియం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇంతకీ సీడీఎస్‌ అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. ప్రతి బ్యాంకు వ్యాపారాన్ని కొనసాగించడం కోసం ఎక్కడో ఒక చోట రుణం తీసుకుంటుంది. అలాగే క్రెడిట్‌ సూయిజ్‌ సైతం కొన్ని సంస్థల నుంచి నిధులను సమకూర్చుకుంది. మరి ఒకవేళ ఈ కంపెనీ దివాలా తీస్తే రుణమిచ్చిన వారి పరిస్థితి ఏంటి? అందుకోసమే రుణదాతలు ఇలాంటి కంపెనీలకు లోన్‌ ఇచ్చేటప్పుడు ‘క్రెడిట్‌ డీఫాల్ట్‌ స్వాప్స్‌’ని కొనుగోలు చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే సీడీఎస్‌ అంటే బీమానన్నమాట! ఒకవేళ క్రెడిట్‌ సూయిజ్‌ దివాలా తీస్తే ఆ సొమ్ముని సీడీఎస్‌ జారీ చేసిన సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎక్కడైతే రిస్క్‌ ఎక్కువ ఉంటుందో.. అక్కడ ప్రీమియం  ఎక్కువుంటుంది. ఇప్పుడు క్రెడిట్‌ సూయిజ్‌ సీడీఎస్‌ ప్రీమియం చాలా భారీగా పెరిగింది. ఆ కంపెనీ దివాలా తీసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రీమియం అధికంగా వసూలు చేస్తున్నారని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వీడుతున్న ఉద్యోగులు..

మరోవైపు చాలా మంది ఉద్యోగులు క్రెడిట్‌ సూయిజ్‌ను వీడుతున్నారు. వీరి స్థానంలో కంపెనీని కొత్తవారిని నియమించుకోవడం లేదు. పైగా గడువు తీరిన ఒప్పంద ఉద్యోగుల ఒప్పందాలను పునరుద్ధరించడం లేదు. ఇటీవలే కంపెనీలో కీలక స్థానంలో ఉన్న జెన్‌ వాల్టర్‌ రాజీనామా చేశారు. 27 ఏళ్ల పాటు ఇక్కడ పనిచేసిన ఆయన సిటీ గ్రూప్‌లో చేరారు. కంపెనీ గ్లోబల్‌ క్రెడిట్‌ ప్రొడక్ట్స్‌ విభాగాధిపతి డేనియల్‌ మెక్కార్తీ సైతం కంపెనీని వీడిన ప్రముఖుల్లో ఉన్నారు. ఈ తరుణంలో కంపెనీ సీఈఓ ఉల్రిచ్‌ కోర్నర్‌ సెప్టెంబరు 30న ఓ లేఖ రాశారు. ‘‘కంపెనీ లోపల, బయటా చాలా అస్థిరత నెలకొంది. ఊహాగానాలు చుట్టుముట్టాయని నాకు తెలుసు. అక్టోబరు 27కి ముందు నేను మీతో కంపెనీలో మార్పులకు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించలేకపోతున్నాను. ఆరోజు నేను మీతో నేరుగా మాట్లాడతాను. ఇది బ్యాంకుకు చాలా కఠిన సమయం. ఈలోపు వదంతులు, ఊహాగానాలు మరింత బలపడే అవకాశం ఉంది. షేరు ధర కంపెనీ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించదు. కంపెనీకి ఉన్న బలమైన మూలధన వనరులు, ద్రవ్యలభ్యత విషయంలో మీకు ఎలాంటి ఆందోళనా అవసరం లేదని విశ్వసిస్తున్నాను. సంస్థను పునర్‌వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం. ఆ ప్రణాళిక మనల్ని విజయతీరాలకు చేరుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని ఉద్యోగులకు తెలిపారు.

దివాలాతో దెబ్బలు..

కంపెనీ విషయంలో ఆందోళన కలిగించే మరో అంశం.. ఇన్వెస్టింగ్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు. వాస్తవానికి క్రెడిట్‌ సూయిజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వల్లే అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు పొందింది. క్రెడిట్‌ సూయిజ్‌ పెట్టుబడులు పెట్టిన ఆర్కిగోస్, గ్రీన్‌సిల్‌ అనే సంస్థలు దివాలా తీయడం కూడా ప్రతికూలంగా మారింది. దీంతో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌లో కంపెనీ పూర్తిగా పట్టు కోల్పోయిందన్న అంచనాలు బలపడ్డాయి.

నిజంగా లేమన్‌ బ్రదర్స్‌ అంతటి ప్రభావం ఉంటుందా?

ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రెడిట్‌ సూయిజ్‌ సమస్యలు కేవలం ఆ ఒక్క కంపెనీకి మాత్రమే చెందినవని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కానీ, లేమన్‌ బ్రదర్స్‌ వ్యవహారం మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపిందని వివరిస్తున్నారు. మరోవైపు క్రెడిట్‌ సూయిజ్‌ కార్యకలాపాలు ప్రధానంగా స్విట్జర్లాండ్‌కే పరిమితమని వాదిస్తున్నారు. సమస్య కేవలం కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ విభాగంలో మాత్రమేనని వివరణ ఇస్తున్నారు. కాబట్టి ప్రభావం ఆ స్థాయిలో ఉండకపోవచ్చునన్నది ఓ వాదన.

మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో క్రెడిట్‌ సూయిజ్‌ దివాలా తీస్తే సంక్షోభం తప్పదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కరోనా, ఇంధన ధరల పెరుగుదల, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం, రేట్ల పెంపు.. ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వరుస సవాళ్లను ఎదుర్కొంటోంది. సరిగ్గా ఈ తరుణంలో క్రెడిట్‌ సూయిజ్‌ సంక్షోభం తెరపైకి వస్తే మాంద్యం మరింత ముందొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

భారత్‌పై ప్రభావం ఎంత?

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తలెత్తితే ఆ ప్రభావం కచ్చితంగా భారత్‌పై ఉంటుంది. కానీ, ప్రత్యేకంగా క్రెడిట్‌ సూయిజ్‌ వల్ల వచ్చే ముప్పేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ కంపెనీ కార్యకలాపాలు భారత్‌లో పరిమితమే. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ భారత కార్యలాపాల బ్యాలెన్స్‌ షీట్‌ పరిమాణం రూ.19,189 కోట్లు మాత్రమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని