మోదీ రోజుకు 14-16 గంటలు పని చేస్తున్నారు: ‘70 పని గంటల’ వ్యాఖ్యను స్వాగతించిన జిందాల్

ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి(Narayana Murthy) ‘70 పని గంటల’ అభిప్రాయంపై భిన్నమైన స్పందన వస్తోంది. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన మాటలను స్వాగతించారు.

Published : 28 Oct 2023 12:24 IST

దిల్లీ: అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ( Narayana Murthy) వ్యక్తం చేసిన అభిప్రాయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌(JSW Chairman Sajjan Jindal).. నారాయణ మూర్తి అభిప్రాయానికి సానుకూలత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని రోజుకు 14 నుంచి 16 గంటలు పనిచేస్తారని వెల్లడించారు.

‘నారాయణ మూర్తి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఆయన మాట్లాడింది అంకితభావం గురించి. మనమంతా గర్వపడేలా 2047లో భారత్‌ను సూపర్‌పవర్‌గా మార్చాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశానికి వారానికి ఐదు రోజుల పని విధానం అవసరం లేదు. మన ప్రధాని మోదీ రోజూ 14 నుంచి 16 గంటలు పనిచేస్తున్నారు. నా తండ్రి రోజుకు 12 నుంచి 14 గంటలు సంస్థ ఎదుగుదలకు కేటాయించేవారు. నేను 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నా’ అని జిందాల్‌ అన్నారు. మోదీ(Modi) గతంలో చెప్పిన విషయాన్ని ఉదహరించారు.

యువత వారానికి 70 గంటలు పనిచేయాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి

‘మన పనిలో ఆనందాన్ని, దేశ అభివృద్ధిని చూడాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన పరిస్థితులు, సవాళ్లు భిన్నమైనవి. ఆ దేశాల ప్రజలు వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు పనిచేస్తున్నారు. వారి ముందు తరాలు సుదీర్ఘంగా పనిచేయడమే అందుకు కారణం. అందుకే వేరే దగ్గరి వర్క్‌ వీక్‌ను మనకు ప్రమాణంగా చూడలేం. భారత్‌కున్న అతిపెద్ద సానుకూలత యువతే. అందుకే భారత్‌కు సూపర్ పవర్‌ హోదా కోసం యువత విశ్రాంతి కంటే పనికే ప్రాధాన్యత ఇవ్వాలి. మనం పురోగతి చెందుతుంటే.. వాటంతట అవే సౌకర్యాలు కూడా వస్తాయి. 2047 నాటికి దేశ యువత మన త్యాగాల ప్రయోజనాలను పొందుతారు’ అంటూ అధిక పనిగంటల ప్రాముఖ్యతను జిందాల్‌ వివరించారు. అయితే ఈ మాటలపై కూడా నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని