Health Goals: జెరోదా సీఈఓ ఆరోగ్య చిట్కాలు.. మనమూ పాటించేద్దామా?

జెరోదా సీఈఓ నితిన్‌ కామత్‌ ట్విటర్‌లో తన ఫాలోవర్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలను పంచుకున్నారు. సరిపడా నిద్ర, మధ్య మధ్యలో లేచి నిలబడడం వంటివి మంచి ఆరోగ్యాన్నిస్తాయని తెలిపారు.

Published : 03 Jan 2023 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనలో చాలా మంది ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకుంటాం. అందుకోసం ప్రణాళికలు కూడా వేసుకుంటాం. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాల్లో ఆరోగ్యం, శారీరక దృఢత్వం వంటివి కచ్చితంగా ఉంటాయి. 90 శాతం మంది న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌లో ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ఉంటాయని ఓ సర్వేలో తేలింది. కానీ, డిసెంబరు 31 వచ్చే నాటికి వాటిని అమలు చేసేవాళ్లు ఎంతమంది? నిజానికి వాటిని సాధించలేకపోతున్నాం కాబట్టే అవి ప్రతి ఏడాది మన లక్ష్యాల్లో చేరుతున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని మన జీవితంలో భాగం చేసుకుంటే.. ప్రత్యేకంగా తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి?

జెరోదా సీఈఓ నితిన్‌ కామత్‌కు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చాలా ఎక్కువ. ట్విటర్‌లో తరచూ ఆయన తన ఫాలోవర్లతో వివిధ అంశాలను పంచుకుంటుంటారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగానూ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కోసం ఆయన కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూసి.. వాటిని ఈ ఏడాది మన లక్ష్యాల్లో భాగం చేసుకుందాం. వచ్చే ఏడాదికల్లా వాటిని మన జీవితంలో భాగం చేసుకొని.. మళ్లీ 2024 తీర్మానాల్లో ప్రత్యేకంగా లేకుండా చూసుకుందామా మరి!

నితిన్‌ కామత్‌ సూచనలు ఆయన మాటల్లోనే..

‘‘గత కొన్నేళ్లుగా నేను ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాను. కొన్ని అంశాలను నేను, నా బృందం కలిసి పరీక్షించాం కూడా. భారతీయులను మరింత ఆరోగ్యంగా మార్చేందుకు దోహదం చేస్తున్న కొన్ని అంకుర సంస్థలకు తోడ్పాటునందిస్తున్నాం. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి కావాల్సిన కొన్ని అంశాలను పరిశీలిద్దాం..’’

  • ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బు ఖర్చుపెట్టినా కూడా ఆరోగ్యాన్ని కొనలేం. డబ్బు సంపాదనలో పడి మనం ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. వయసు పెరిగే కొద్దీ.. మన ఆరోగ్యమే మనకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తుంది. డబ్బు కాదు. ఏదైనా అనూహ్య సంఘటనలు ఎదురైనప్పుడు వాటి నుంచి వేగంగా కోలుకోవడమే నిజమైన ఆరోగ్యం.
  • ఆరోగ్యానికి సంబంధించి మీ లక్ష్యాలు.. మీ సంతోషం, సంతృప్తి, భావనలపై ఆధారపడి ఉండాలి. మీరు ఎలా కనబడతారనే దానిపై కాదు. ప్రముఖులను చూసి వారిలా కనపడాలని ఆరాటపడుతుంటాం. వాళ్లు ఫొటోగ్రఫీ, లైట్లు, కొన్ని రకాల ఔషధాలు.. వీటన్నింటినీ వాడి తాత్కాలికంగా అలా కనిపిస్తుంటారు. ఇవన్నీ చివరకు ఇబ్బందులకు కారణమవుతాయి..
  • నిరంతరం కూర్చోవడం పొగతాగడం లాంటిదే. రోజులో ఎన్ని కెలరీలు ఖర్చు చేస్తున్నాం? ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడడం వంటి చిన్న చిన్న యాక్టివిటీలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఆరోగ్యానికి సంబంధించి రోజూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. 90 శాతం దాన్ని చేరుకోవాలనేది ఇప్పుడు జెరోదాలో అమలు చేస్తున్నాం.
  • రోజు ముగిసే సమయానికి మనలో అలసట పెరిగి స్వీయ నియంత్రణ కోల్పోతాం. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. దీన్ని త్వరగా నిద్రపోవడం అనే అలవాటు ద్వారా అధిగమించొచ్చు. అందుకే రాత్రి 9 గంటల కల్లా పడుకొని ఉదయం 5 గంటలకు లేవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజంతా ఆరోగ్యకరమైన అలవాట్లతో గడిపేందుకు పొద్దున చేసే వ్యాయామం దోహదం చేస్తుంది.
  • మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. దీనికి ఇప్పటి వరకు తక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాం. తక్కువ నిద్ర, ఎక్కువ పని చేయాలనే అంశాన్ని గొప్ప విషయంగా ప్రచారం చేస్తూ వచ్చారు. జీవితం మారథాన్‌ లాంటిది. వేగంగా పరిగెత్తుతూ దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోతే.. మధ్యలోనే అలసిపోతాం. అప్పుడు పరుగుకు బలమైన ముగింపునివ్వలేం.
  • నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు డివైజ్‌లన్నింటినీ పక్కన పెట్టడం; అత్యవసరమైతే తప్ప సాయంత్రం ఆరు గంటల తర్వాత జెరోదా ఆన్‌లైన్‌లో వర్క్‌చాట్స్‌ను ముగించడం; నిద్రకు ముందు, వారాంతాల్లో.. మనసుకు ఉల్లాసాన్ని, విశ్రాంతినిచ్చే వ్యాపకాలకు సమయాన్ని కేటాయించడం.. ఇవి నాకు చక్కగా నిద్రపోవడానికి ఉపకరించాయి.
  • పోషకాహారం విషయంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను. రుచికరమైన ఆహారం, స్వీట్లు, మద్యపానం అంటే నాకు చాలా ఇష్టం. కానీ, త్వరగా రాత్రిభోజనాన్ని ముగించడం, మద్యపానానికి ముందు ప్రోటీన్‌సహిత ఆహారాన్ని తీసుకోవడం, రిఫైన్డ్‌ షుగర్‌ లేని పండ్లు, ఖర్జూర, ‘స్టెవియా’ వంటివి ఆరగించడం ప్రారంభించాను. తద్వారా రుచికరమైన ఆహారం, స్వీట్లు, మద్యపానాన్ని కోల్పోతానన్న భావనను అధిగమించాను.
  • మనలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారే భిన్నంగా ఉంటారు. మనకేది నప్పుతుందో కనుక్కోవడం ఓ స్వీయ ఆవిష్కరణ. అప్పుడే మనం అనుకున్నవాటిని నిరంతరాయంగా కొనసాగించగలుగుతాం. పుట్టినరోజు, కొత్త సంవత్సరం వంటి సందర్భాల్లో స్ఫూర్తిపొందడం కంటే అదే మంచి ఫలితాలిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు