Tax collection: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 23% వృద్ధి

Tax collection: సెప్టెంబరు 16 నాటికి రూ.1.22 లక్షల కోట్ల రిఫండ్లను సర్దుబాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. స్థూలంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.87 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి.

Published : 19 Sep 2023 01:44 IST

దిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (Net direct tax collection) ఇప్పటి వరకు రూ.8.65 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన 23.51 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. కార్పొరేట్ల నుంచి అధిక ముందస్తు పన్ను (Advance tax) వసూళ్లు.. వృద్ధికి దోహదం చేసినట్లు పేర్కొంది.

2023 సెప్టెంబరు 16 నాటికి వసూలైన రూ.8,65,117 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను (Net direct tax collection)ల్లో రూ.4.16 లక్షల కోట్లు కార్పొరేట్‌ ఆదాయపు పన్ను (corporate income tax) కాగా, రూ.4.47 లక్షల కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయం (personal income tax). ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల (Net direct tax collection)లో 23.51 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. దీంట్లో ముందస్తు పన్ను వసూళ్లు రూ.3.55 లక్షల కోట్లు. క్రితం ఏడాది నమోదైన రూ.2.94 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి 21 శాతం వృద్ధి నమోదైంది. రూ.3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో రూ.2.80 లక్షల కోట్లు కార్పొరేట్‌ పన్నుల ఆదాయం కాగా.. రూ.74,858 కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయం.

సెప్టెంబరు 16 నాటికి రూ.1.22 లక్షల కోట్ల రిఫండ్లను సర్దుబాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. స్థూలంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.87 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన ఇది 18.29 శాతం అధికం. కార్పొరేట్‌, వ్యక్తిగత ఆదాయంపై వసూలు చేసే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం నిదర్శనంగా చెబుతుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని