వర్క్‌కల్చర్‌పై నారాయణమూర్తి కామెంట్స్.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన

Reactions on Narayana Murthy comments: వారానికి 70 గంటలు చొప్పున యువత పనిచేయాలంటూ నారాయణమూర్తి వ్యక్తం చేసిన అభిప్రాయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆయనతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం విభేదించడం గమనార్హం.

Updated : 27 Oct 2023 15:36 IST

Narayana Murthy | ఇంటర్నెట్‌ డెస్క్‌: అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ చేరాలంటే దేశ యువత వారానికి 70 గంటల చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ( Narayana Murthy) అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీ ప్రజలు ఎలాగైతే విరామం ఎరుగక పనిచేశారో.. అదే తరహాలో దేశ యువత పనిచేయాలంటూ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా.. మరికొందరు బాస్‌లు మాత్రం నారాయణమూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు.

వర్క్‌ కల్చర్‌ గురించి నారాయణమూర్తి (Narayana Murthy) వ్యక్తం చేసిన అభిప్రాయంపై ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆయన అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. తక్కువ పనిచేసి కాలం గడిపేయాల్సిన సమయం కాదని.. గతంలో ఇతర దేశాలు కొన్ని తరాల పాటు చేసిన పనిని ఇప్పుడు మనం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ట్రేడ్‌ బ్రెయిన్‌ అండ్‌ ఫిన్‌ గార్డ్‌ సీఈఓ క్రితేశ్‌ అభిషేక్‌ సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. చిన్న చిన్న లక్ష్యాల కోసమైతే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని.. పోటీ ప్రపంచంలో దూసుకెళ్లాలంటే అదే స్థాయిలో కష్టపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదే విధానాన్ని నారాయణమూర్తి ఆచరించి విజయం సాధించారని అభిషేక్‌ రంగ్తా అనే ఆంత్రప్రెన్యూర్‌ అభిప్రాయపడ్డారు.

యువత వారానికి 70 గంటలు పనిచేయాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి

నారాయణమూర్తి (Narayana Murthy) అభిప్రాయంతో విభేదించిన వారూ ఉన్నారు. ఉత్పాదకత పెరగాలంటే ఎక్కువ సమయం పనిచేయాల్సిన అవసరం లేదని అప్‌గ్రాడ్‌ వ్యవస్థాపకుడు రోనీ స్క్య్రూవాలా పేర్కొన్నారు. నైపుణ్యాలకు పదునుపెట్టి, మెరుగైన పని వాతావరణం, సరిపడా వేతనం అందిస్తే.. ఇంకా ఎక్కువ ఉత్పాదకత రాబట్టొచ్చని అభిప్రాయపడ్డారు. అందరికీ పని ప్రదేశం దగ్గర్లో ఉండదని, ట్రాఫిక్‌ చిక్కులు, మెట్రో రద్దీ వంటి సమస్యలతో యువత నిత్యం సావాసం చేయాల్సి ఉంటుందని, అలాంటి ప్రాక్టికల్‌ ఇబ్బందులు కూడా ఎన్నో ఉంటాయని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. 70 గంటలు పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. అందుకు తగిన వేతనం కూడా ఇస్తారా మరి అంటూ మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. మొత్తానికి నారాయణమూర్తి వ్యాఖ్యలు కొత్త చర్చకైతే తెరతీశాయి.

Full video..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని