Appleలో ఉద్యోగం కావాలా? ఈ నైపుణ్యాలు ఉండాలంటున్న సీఈఓ టిమ్ కుక్!

Apple: తమ కంపెనీలో పనిచేయాలనుకునే ఉద్యోగులకు ఉండాల్సిన నైపుణ్యాల గురించి యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు నచ్చిన కొన్ని పుస్తకాలనూ వెల్లడించారు.

Updated : 27 Nov 2023 17:01 IST

వాషింగ్టన్‌: వినూత్న ఆవిష్కరణలు, నాణ్యమైన ఉత్పత్తులకు టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) పెట్టింది పేరు. ఇలాంటి కంపెనీలో పనిచేయాలని కలలు కనని టెకీలు ఉండరు. కానీ, అందరికీ ఆ అవకాశం రాదు. మరి ఇలాంటి కంపెనీలో పనిచేయాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? ఏం చేస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్‌ దిగ్గజంలో అడుగుపెట్టగలం? వీటికి ఆ కంపెనీ సీఈఓనే స్వయంగా సమాధానమిచ్చారు.

యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్ (Tim Cook) ఇటీవల ప్రముఖ గాయకురాలు, పాటల రచయిత్రి డువా లిపి నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో యాపిల్‌లో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి నైపుణ్యాలు ఉంటాయి? కొత్తగా చేరాలనుకునేవారిలో ఎలాంటి నైపుణ్యాల కోసం చూస్తారు? అని డువా లిపా ప్రశ్నించారు.

దీనిపై కుక్ (Tim Cook) మాట్లాడుతూ.. తమ కంపెనీలో ఉద్యోగులందరిలో కామన్‌గా ఒకరికొకరు సహకారంతో పనిచేసే లక్షణం తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. ఒకటికి ఒకటి కలిపితే మూడుకు సమానమనే సూత్రాన్ని విశ్వసిస్తారని తెలిపారు. ఒక్కొక్కరు తమ వ్యక్తిగత సామర్థ్యంతో పనిచేస్తే వచ్చే రిజల్ట్‌ కంటే అందరూ కలిసి బృందంగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు. కొత్తగా తీసుకోబోయే వారిలోనూ ఇలా సమన్వయంతో పనిచేసే లక్షణం ఉందా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

మరోవైపు యాపిల్‌ (Apple)లో పనిచేయాలంటే కచ్చితంగా కాలేజ్‌ డిగ్రీ ఉండాలా అని కుక్‌ను డువా లిపా ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. యాపిల్‌లో అన్ని రంగాల వారికీ పని ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో కాలేజ్‌ డిగ్రీ కచ్చితంగా అవసరంలేని వారు కూడా తమ కంపెనీలో ఉన్నారన్నారు. అలాగే యాపిల్‌లో పనిచేసేవారికి అత్యంత కీలకమైన నైపుణ్యాల్లో కోడింగ్‌ కూడా ఒకటని వివరించారు. అయితే, కోడింగ్‌పై పెద్దగా అవగాహనలేని.. రోజువారీ కార్యకలాపాల్లో అంతగా కోడింగ్‌ ఉపయోగించని వారిని కూడా యాపిల్‌ నియమించుకుందని తెలిపారు.

ఆర్‌బీఐ నిబంధనలు కఠినతరం.. పర్సనల్‌ లోన్‌ పొందడం ఇప్పుడెలా?

యాపిల్ ఉద్యోగుల్లో ఉండాల్సిన ఇతర నైపుణ్యాల గురించి కుక్‌ మాట్లాడుతూ.. ఆతృతగా ఉంటూ ప్రశ్నలు అడగడానికి భయపడని వారిని తాను కోరుకుంటానని తెలిపారు. అలాగే సృజనాత్మకతతో బృందంలో కలిసి పనిచేసేవారి కోసమూ తాము అన్వేషిస్తామని వెల్లడించారు.

ఇదే పాడ్‌కాస్ట్‌లో టిక్‌ కుక్‌ ఆయనకు నచ్చిన ఐదు పుస్తకాలనూ పంచుకున్నారు. అవేంటో చూద్దాం..

  • టు కిల్‌ ఏ మాకింగ్‌బర్డ్‌ (To Kill A Mockingbird): ఈ పుస్తక రచయిత హార్పర్‌ లీ. విద్యార్థులతో పాటు ఇది అన్ని వయసులవారినీ ఆకట్టుకుంటుందని కుక్‌ తెలిపారు.
  • షూ డాగ్‌ (Shoe Dog): నైకీ సహ వ్యవస్థాపకుడు ఫిల్‌ నైట్‌.. తమ కంపెనీ నిర్మాణం, ఆయన వ్యక్తిగత జీవిత అనుభవాలను ఈ ‘షూ డాగ్‌’ పుస్తకంలో పంచుకున్నట్లు కుక్‌ పేర్కొన్నారు.
  • వెన్‌ బ్రీత్‌ బికమ్స్‌ ఎయిర్‌ (When Breath Becomes Air ): ఈ పుస్తక రచయిత పాల్‌ కళానిధి. అసాధారణమైన జ్ఞాపకాల పుట్టగా ఈ పుస్తకాన్ని కుక్‌ అభివర్ణించారు. న్యూరోసర్జన్‌ అయిన కళానిధి.. అనారోగ్యం, మెడిసిన్‌కు సంబంధించిన అనేక విషయాలను ఈ పుస్తకంలో పంచుకున్నట్లు తెలిపారు.
  • ఐయామ్‌ మలాలా (I Am Malala): ఆడపిల్లల చదువు కోసం మలాలా యూసఫ్‌జాయ్‌ చేస్తున్న పోరాటాన్ని కుక్ అభినందించారు. బ్రిటన్‌ జర్నలిస్ట్‌ క్రిస్టినా ల్యాంబ్‌తో కలిసి ఈ జీవిత చరిత్ర పుస్తకం.. మాలాలా చిన్నతనం, 15 ఏళ్ల వయసులో ఆమె ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఉంటుందన్నారు.
  • పై పుస్తకాలతో పాటు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌, బాబీ కెన్నెడీ జీవితచరిత్ర పుస్తకాల నుంచి కూడా తాను స్ఫూర్తి పొందానని కుక్‌ తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని