Narayanamurthy: ఇన్ఫోసిస్‌ కోసం స్టోర్‌ రూమ్‌లో నిద్రించి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని!

ఇన్ఫోసిస్‌ నెలకొల్పిన తొలినాళ్లలో నారాయణ మూర్తి ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాల గురించి భారత్‌-అమెరికన్‌ రచయిత్రి చిత్రా బెనర్జీ తన తాజా పుస్తకంలో వెల్లడించారు.

Published : 07 Jan 2024 16:30 IST

దిల్లీ: జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకునేందుకు చాలా మంది తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోతుంటారు. ఇదే కోవలోకి వస్తారు.. ఇన్ఫోసిస్‌ (Infosys) వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy). కెరీర్‌ ప్రారంభంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులు, అవమానాల గురించి గతేడాది డిసెంబరులో విడుదలైన ‘అన్‌కామన్‌ లవ్‌: ది ఎర్లీ లైఫ్‌ ఆఫ్‌ సుధా అండ్‌ నారాయణమూర్తి’ పుస్తకంలో వెల్లడించారు. భారత-అమెరికన్‌ రచయిత్రి చిత్రా బెనర్జీ దివకరుణి (Chitra Banerjee Divakaruni) ఈ పుస్తకాన్ని రచించారు. 

ఇన్ఫోసిస్‌ స్థాపించిన తొలినాళ్లలో అమెరికాలోని డేటా బేసిక్స్‌ కార్పొరేషన్‌ అనే సంస్థ క్లయింట్‌గా ఉండేది. ఈ కంపెనీని డానీ లిల్స్‌ అనే వ్యాపారవేత్త నిర్వహించేవాడు. నారాయణ మూర్తి బృందానికి సమయానికి చెల్లింపులు చేయకుండా ఆయన ఇబ్బందులకు గురి చేసేవాడని, మాన్‌హాట్టన్‌లోని డేటా బేసిక్స్ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించేవాడు కాదని పుస్తకంలో వెల్లడించారు. 

ఇన్ఫోసిస్‌ కోసం..

‘‘డేటా బేసిక్స్‌కు సర్వీస్‌ అందించేందుకు ఒకసారి నారాయణమూర్తి అమెరికా వచ్చారు. ఆ సమయంలో డానీ కిటికీలు లేని చిన్న గది (స్టోర్‌ రూమ్‌) ఆయనకు ఇచ్చారు. తన ఇంట్లో నాలుగు విశాలవంతమైన బెడ్‌రూమ్‌లు ఉన్నప్పటికీ.. మూర్తిని ఇరుకు గదిలో ఉంచారు. ఎన్నో సందర్భాల్లో చివరి నిమిషంలో డానీ చేసిన డిమాండ్‌లను నారాయణ మూర్తి నెరవేర్చారు’’ అని పుస్తకంలో పేర్కొన్నారు. ఇన్ఫోసిస్‌ ప్రారంభ దశలో ఉండటంతో కంపెనీ కోసం డానీ ప్రవర్తనను మూర్తి భరించారని, బల్లపై పడుకున్న ఘటన మాత్రం ఆయన్ను షాక్‌ గురిచేసిందని తెలిపారు.

ఆమెను ఇన్ఫోసిస్‌కు దూరంగా ఉంచి తప్పుచేశా: నారాయణ మూర్తి

అతిథిదేవోభవ 

ఈ అనుభవాన్ని ఒకానొక సందర్భంలో భార్య సుధామూర్తితో పంచుకుంటూ.. ‘‘అతిథి దేవుడితో సమానమని మా అమ్మ చెప్పేది. వారితో నువ్వు ప్రవర్తించే తీరు నీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా మా నాన్న ఎన్నోసార్లు ఇంటికి అతిథులను ఆహ్వానించినా.. మా అమ్మ తాను తినకుండా వారికి భోజనం ఏర్పాటు చేసేది. కానీ, డానీ మాత్రం నన్ను ఇరుకు గదిలో ఉండమని చెప్పి, తన లగ్జరీ బెడ్‌రూమ్‌లో హాయిగా నిద్రపోయాడు’’ అని ఆయన చెప్పినట్లు పుస్తకంలో వెల్లడించారు. 

ఆయనకు రష్యన్‌.. ఆమెకు ఆంగ్లం

నారాయణ మూర్తి దంపతులకు చాలా విషయాల్లో ఉమ్మడి అభిప్రాయాలు ఉన్నాయని చిత్రా బెనర్జీ తెలిపారు. ఇరువురిది కన్నడ నేపథ్యం కావడం, పుస్తక పఠనంపై ఆసక్తి, బాల్యంలో ఇద్దరు ఒకే విధమైన వాతావరణంలో పెరగడం అందుకు కారణమని పుస్తకంలో వెల్లడించారు. మూర్తి మాత్రం రష్యన్‌ పుస్తకాలను ఎక్కువగా ఇష్టపడేవారట. భవిష్యత్తు అంతా రష్యన్ భాషదేనని, అందుకే ఆ పుస్తకాలను ఎక్కువగా చదువుతూ, సేకరిస్తున్నానని చెప్పేవారట. సుధా మూర్తి మాత్రం.. ఆంగ్లం ప్రపంచ భాషగా మారుతుందని నమ్మేవారట. పాఠశాల విద్య మొత్తం కన్నడలో సాగినప్పటికీ.. ఆమె ఎక్కువగా ఆంగ్ల పుస్తకాలను చదివేందుకు ఇష్టపడేవారట. వివాహం జరిగిన ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన్ను ఒప్పించి రష్యన్‌ పుస్తకాలను ఇంట్లోంచి తీసేసినట్లు సుధా మూర్తి చెప్పారని చిత్రా బెనర్జీ పుస్తకంలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని