Vodafone Idea: వొడాఫోన్‌లో ప్రభుత్వ వాటా.. ఎందుకు ఆలస్యం అవుతోంది?

వొడాఫోన్‌ ఐడియా బకాయిలను వాటాలుగా మార్చుకునే అంశం దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది. దీంతో బ్యాంకులు నుంచి రుణం సమకూర్చుకోలేక, 5జీ సేవల విస్తరణపై దృష్టి పెట్టలేక ఆ కంపెనీ సతమతమవుతోంది.

Updated : 05 Jan 2023 19:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్‌ 5జీ విషయంలో దూసుకెళ్తున్నాయి. పోటాపోటీగా తమ సేవలను విస్తరించుకుంటూ వినియోగదారుల సంఖ్యను సైతం పెంచుకుంటున్నాయి. అదే ప్రైవేటు రంగానికి చెందిన వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) మాత్రం ఇప్పటి వరకు 5జీకి సంబంధించి ఊసే ఎత్తలేదు. 5జీ సేవల విస్తరణకు పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి. ప్రభుత్వ వాటా అంశం తేలే వరకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా లేవు. రుణం సమకూరితే గానీ కంపెనీ ముందుకెళ్లే పరిస్థితి లేదు. బకాయిలను వాటాలుగా మార్చేందుకు ఓకే అన్న ప్రభుత్వం.. ప్రక్రియను పూర్తి చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో వీఐ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంతకీ వొడాఫోన్‌ బకాయిలను వాటాలుగా మార్చుకొనే విషయంలో ఆలస్యం దేనికి? ప్రభుత్వం ఏం చెప్తోంది?

రుణ ఇబ్బందుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2021లో ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. స్పెక్ట్రమ్‌ వాయిదాలతో పాటు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలపై వడ్డీ చెల్లించడానికి బదులుగా ఆ మొత్తాన్ని సంస్థలో ఈక్విటీ వాటాగా మార్చాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు వొడాఫోన్‌ ఇండియా అంగీకరించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.16వేల కోట్ల వడ్డీని సుమారు 33 శాతం వాటాగా మార్చేందుకు బోర్డు నిర్ణయించింది. ప్రభుత్వం వాటా తీసుకుంటే ప్రమోటర్ల వాటా ఇప్పుడున్న 74.39 శాతం నుంచి 50 శాతం దిగువకు చేరనుంది.

మరెందుకు మార్చుకోవడం లేదు? 

సంస్థ బకాయిలను ఈక్విటీలుగా మార్చే విషయంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఆమోదం తెలిపింది. అయితే, వొడాఫోన్‌ షేరు విలువ స్టాక్‌ మార్కెట్‌లో రూ.10 వద్ద స్థిరత్వం సాధించిన తర్వాతే ప్రక్రియను పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. అలాంటి నిబంధనేదీ లేదని వొడాఫోన్‌ ఐడియా వాదన. అయితే, షేరు విలువ రూ.10కు చేరుకోవడానికి వొడాఫోన్‌ ఆపసోపాలు పడుతోంది. షేరు విలువ పెరగకపోగా నానాటికీ పడిపోతోంది. మరోవైపు ప్రమోటర్లు కంపెనీలో తమ మూలధనాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. కంపెనీ స్థిరత్వం సాధించేందుకు రూ.40-50వేల కోట్లు అవసరం ఉండగా.. ప్రమోటర్లు కేవలం రూ.2-3వేల కోట్లకు మించి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. 

కంపెనీకి రూ.10వేల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు 2022 జనవరిలో ప్రమోటర్లు హామీ ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, అప్పటి నుంచి కేవలం రూ.4900 కోట్లు మాత్రమే ప్రమోటర్లు మూలధనంగా పెట్టారు. అందులో చాలా వరకు మొత్తం ఇండస్‌ టవర్లకు చెల్లించాల్సిన మొత్తానికే వినియోగించారని తెలుస్తోంది. మరోవైపు వొడాఫోన్‌ ఐడియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్దకు రుణం కోసం వెళ్లగా అక్కడా చేదు అనుభవం ఎదురైంది. రూ.15-16వేల కోట్ల రుణం కోసం వెళ్లగా.. ప్రభుత్వ వాటా కోసం ఆ బ్యాంక్‌ స్పష్టత కోరినట్లు తెలిసింది.

ప్రస్తుత పరిస్థితేంటి?

గడిచిన రెండు మూడ్రోజులుగా వొడాఫోన్‌ అంశం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ప్రమోటర్లు మూలధనం సమకూర్చకుండా బకాయిలను ఈక్విటీలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ససేమిరా అంటుండడంతో యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ బ్రిటన్‌లోని భారత హైకమిషనర్‌కు లేఖ రాసింది. ఈక్విటీలుగా మార్చుకునే సందర్భంలో ఇలా కండీషన్లు ఏవీ పెట్టలేదని, ఈ ప్రక్రియ ఆలస్యం అవ్వడం వల్ల కంపెనీ నిధుల సమీకరణ ఆలస్యమవుతోందని పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని భారత హైకమిషనర్‌ ఆర్థిక శాఖకు లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలిసింది. తాజాగా ఈ అంశంపై టెలికాం మంత్రి సైతం స్పందించారు. అయితే వాటాల మార్పు అంశం కంటే ముందు ఆ కంపెనీకి మూలధనం అవసరం అని చెప్పారు. అవి వేర్వేరు మార్గాల ద్వారా రావాల్సి ఉందని, వాటాలను మార్చుకోవడం ఒక్కటే సమస్య కాదన్నారు. మరోవైపు ఈక్విటీలను మార్చే అంశాన్ని వేగవంతం చేయాలని ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా టెలికాం మంత్రిని కోరినట్లు తెలిసింది. మొత్తానికి కొన్ని రోజులుగా సాగుతూ వస్తున్న ఈ వ్యవహారం ఇంకెన్ని రోజులు కొనసా...గుతుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని