Hyderabad News: భర్తతో స్నేహంగా ఉంటోందని కిరాయి యువకులతో లైంగిక దాడి

కొండాపూర్‌లో దారుణం జరిగింది. గాయత్రి అనే మహిళ ఓ యువతిపై పథకం ప్రకారం నలుగురు యువకులతో దాడి చేయించింది. అనంతరం ఆమెపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

Updated : 30 May 2022 10:18 IST

వీడియో తీసి బెదిరింపులు.. మహిళతో సహా నలుగురి అరెస్టు

హైదరాబాద్‌: కొండాపూర్‌లో దారుణం జరిగింది. గాయత్రి అనే మహిళ ఓ యువతిపై పథకం ప్రకారం నలుగురు యువకులతో దాడి చేయించింది. అనంతరం ఆమెపై నలుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... శ్రీకాంత్‌ కుటుంబం, బాధితురాలు కొండాపూర్‌లోని ఒకే కాలనీలో నివాసముంటున్నారు. ఇద్దరూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి స్నేహంగా ఉంటున్నారు.

 గాయత్రి తన ఆరోగ్యం బాగోలేదని యువతిని కొండాపూర్‌లోని ఇంటికి పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితురాలిని గాయత్రి తన ఇంట్లోనే పెట్టుకుంది. ఈక్రమంలో భర్త శ్రీకాంత్‌, యువతి ప్రవర్తనపై గాయత్రి అనుమానం పెంచుకుంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్‌ 24న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. అనంతరం ఇటీవల కేసును విత్‌డ్రా చేసుకుని మాట్లాడాలంటూ బాధితురాలి కటుంబ సభ్యులను ఇంటికి పిలిచింది. వారితో మాట్లాడిన తర్వాత కాసేపటికి పథకం ప్రకారం యువతిని గదిలోకి తీసుకెళ్లి  కిరాయికి మాట్లాడుకున్న నలుగురు యువకులతో దాడి చేయించింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించిన యువకులు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘాతుకాన్ని నిందితురాలు గాయత్రి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. దాడి ఘటనపై ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించింది. తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రితో పాటు, నలుగురు యువకులను అరెస్టు చేసినట్టు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని