విమానాశ్రయాల్లో భారీగా బంగారం పట్టివేత

దుబాయి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1,581 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదటగా దుబాయి నుంచి హైదరాబాద్..

Published : 13 Feb 2020 01:06 IST

హైదరాబాద్: దుబాయి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 1,581 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొదటగా దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్దనున్న సూట్ కేసును విమానాశ్రయంలో మరో ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు. ఇది గమనించిన డీఆర్‌ఐ అధికారులు అనుమానంతో ప్రయాణికుడితో పాటుగా ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా జైపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చినట్లు విచారణలో తేలింది. సూట్ కేసును క్షుణ్నంగా తనిఖీ చేసిన డీఆర్‌ఐ అధికారులు 931 గ్రాముల బంగారంతో తయారు చేసిన సుత్తిని తీసుకొచ్చినట్లు గుర్తించారు. అదే సమయంలో దుబాయి నుంచి హైదరాబాద్‌ వచ్చిన మరో ఇద్దరు ప్రయాణికుల వద్ద కూడా అధికారులు 650 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో డీఆర్‌ఐ అధికారులు మొత్తంగా 1.581 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ముంబయి విమానాశ్రయంలోనూ ఇదే తరహాలో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద డీఆర్‌ఐ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ముంబయి వచ్చిన ప్రయాణికుడి వద్ద ఉన్న సూట్‌కేసును మరో ఇద్దరు వ్యక్తులు తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని తనిఖీ చేసిన అధికారులు 931 గ్రాముల బంగారాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తీసుకొచ్చిన నిందితులను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ రెండు విమానాశ్రయాల్లో స్వాధీనం చేసుకున్న 2.512 కిలోల బంగారం విలువ రూ.కోటి పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని