అద్దెకున్నవారే మట్టుబెట్టారు

చెడు వ్యసనాలకు బానిసై, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరి మహిళలను, ఎవరూ లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొందరు నేరాలకు పాల్పడుతున్నారని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు.

Updated : 24 Nov 2022 05:47 IST

సింగరాయకొండ మహిళ హత్యకేసులో ఆరుగురి అరెస్టు


కేసు వివరాలను వెల్లడిస్తున్న డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ మలికా గార్గ్‌..
చిత్రంలో అదనపు ఎస్పీ శ్రీధర్‌రావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు

సింగరాయకొండ గ్రామీణం, టంగుటూరు, న్యూస్‌టుడే: చెడు వ్యసనాలకు బానిసై, త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒంటరి మహిళలను, ఎవరూ లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకొని కొందరు నేరాలకు పాల్పడుతున్నారని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ అన్నారు. సింగరాయకొండ హనుమాన్‌నగర్‌లో ఈ నెల 17న హత్యకు గురైన పులిబండ్ల నారాయణమ్మ(65) కేసులో నిందితుల వివరాలను బుధవారం ఎస్పీ మలికా గార్గ్‌, అధికారులతో కలిసి స్థానిక పోలీసు స్టేషన్‌లో వెల్లడించారు. సోమరాజుపల్లికి చెందిన చిటితోటి రాజశేఖర్‌, అతని ప్రియురాలు గొల్లపూడి వరలక్ష్మి.. కొన్నాళ్లుగా నారాయణమ్మ ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. నారాయణమ్మ వద్ద ఉన్న బంగారంపై కన్నేసి చోరీ చేసేందుకు అదే ప్రాంతానికి చెందిన అడకా భూలక్ష్మితో కలిసి వీరు పథకం రచించారు. వరలక్ష్మి కుమారుడు అశోక్‌.. అతని స్నేహితులు జాఫర్‌ (బాలాజీనగర్‌), సందీప్‌ అలియాస్‌ చిన్ను (యలమందారెడ్డినగర్‌)లకు వివరించారు. ఈ నెల 17న సాయంత్రం 7.30 గంటల సమయంలో నారాయణమ్మ ఇంటిలో ఉండగా యువకులు ముగ్గురూ ప్రహరీ దూకి ప్రవేశించారు. రాజశేఖర్‌, వరలక్ష్మి, భూలక్ష్మిలు రోడ్డుపై ఉండి వచ్చీపోయే వారిని గమనిస్తూ చరవాణి ద్వారా సమాచారం చేరవేసేవారు. నారాయణమ్మకు కత్తి చూపించి ఆభరణాలు, నగదు ఇవ్వాలని యువకులు బెదిరించారు. ఆమె వాదనకు దిగడంతో దాడి చేశారు. నారాయణమ్మ ముఖంపై దిండుతో గట్టిగా అదమడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. నిందితులు 76 గ్రాముల బంగారం, బీరువాలో ఉన్న నగదు తీసుకొని పరారయ్యారు. సమాచారం అందడంతో అదనపు ఎస్పీ శ్రీధర్‌రావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, సీఐ రంగనాథ్‌, ఎస్సై ఫిరోజా ఫాతిమా పరిశీలించారు. ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. 48 గంటల్లోనే కేసు ఛేదించి, నిందితులను అరెస్ట్‌ చేసి దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ వెల్లడించారు. అధికారులతో పాటు ఎస్సైలు వెంకటేశ్వరరావు, ఖాదర్‌బాషా, ఫిరోజా ఫాతిమా, సిబ్బందిని డీఐజీ, ఎస్పీలు అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు.

దస్త్రాల పరిశీలన

తొలుత సింగరాయకొండ స్టేషన్‌లో దస్త్రాలను డీఐజీ త్రివిక్రమవర్మ పరిశీలించారు. అనంతరం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని మహిళా పోలీసులు ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని