లారీ చోరీ.. ‘పొరుగు’ దారి

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Updated : 27 Nov 2022 05:27 IST

తుక్కుగా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలు..?

ఈ నెల 17వ తేదీన కాగజ్‌నగర్‌ పట్టణం పెట్రోల్‌పంపు నివాసి విజయ్‌కుమార్‌ తన లారీని ప్రయాణ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచారు. ఈక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు దానిని అపహరించారు. దీనిని  కాగజ్‌నగర్‌ అంతర్రాష్ట్ర రహదారిగుండా మహారాష్ట్ర వైపు తీసుకెళ్లినట్లు సిర్పూర్‌(టి) ఏరియాలోని సీసీ కెమెరాలోని సీసీ ఫుటేజీ లభించింది.


కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న చోరీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. దీనికితోడు వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న భారీ వాహనాలను కూడా దొంగలు మాయం చేస్తున్నారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌తోపాటు, పలు మండలాలు మహారాష్ట్ర సరిహద్దున ఉండటాన్ని ఆసరాగా తీసుకొని అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు లారీలను అపహరిస్తున్నారు. ఇటీవల బస్టాండ్‌ సమీపంలో నిలిపి ఉన్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం స్థానికంగా కలకలం సృష్టించింది.

*  2014 సంవత్సరంలో పట్టణంలోని పెట్రోల్‌పంపు ఏరియాలో నిలిపి ఉన్న అఫ్జల్‌కు సంబంధించిన లారీ, రెండేళ్ల క్రితం కులదీప్‌సింగ్‌, భవాణి ప్రసాద్‌లకు సంబంధించిన లారీలు కూడా చోరీకి గురయ్యాయి. తాజాగా విజయ్‌కుమార్‌కు చెందిన లారీ కూడా అపహరణకు గురైంది. ఇప్పటి వరకు నాలుగు లారీలు చోరీ జరిగినప్పటికీ ఏ ఒక్క కేసు మిస్టరీ వీడలేదు.

* జిల్లా పోలీసులతో పాటు, ఎంవీఐ అధికారులు సైతం లారీ చోరీ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్‌(టి) నుంచి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు లభించిన సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందం సభ్యులు మహారాష్ట్రతోపాటు, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో ఆ పోలీసుల సహకారంతో విచారణ ప్రారంభించారు. అయినా ఎలాంటి ఆధారాలు లభించనట్లు తెలిసింది.

*మహారాష్ట్రలోని నాందేడ్‌, అమరావతి, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ ప్రాంతాల్లో తుక్కు పరిశ్రమలకు వీటిని విక్రయిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నిలిపి ఉన్న లారీలు, ఇతర వాహనాలను అపహరించి, వాటిని ఈ తుక్కు వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తుక్కు కేంద్రాలు ఆ వాహనాలను అతి తక్కువకే కొనుగోలు చేసి, వాటిని రెండ్రోజుల్లో యంత్రాల్లో వేసి, తక్కుగా మార్చుతున్నారు. ఇనుప తుక్కును ఉక్కు పరిశ్రమలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో చోరీకి గురైన వాహనాలు ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఆధారాలు లభించకుండా తుక్కు స్మగ్లర్లు వ్యూహత్మకంగా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

లారీ చోరీ కేసును ఛేదించేందుకు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి, విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం లారీ మహారాష్ట్రలోని రాజురా వరకు వెళ్లినట్లు తేలింది. రాజుర  నుంచి నాలుగు రహదారులుండగా, ఏ ప్రాంతం వైపు వెళ్లిందన్న కోణంలో విచారణ చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఆ లారీలను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని