చోరీకి వచ్చి నిద్రలోకి జారుకున్న దొంగ

చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అక్కడ ఉన్న చాక్లెట్లు, ఆహారం తినేసి నిద్రలోకి జారుకున్న ఘటన చెన్నైలో జరిగింది.

Published : 12 Mar 2023 03:00 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే:  చోరీకి వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో అక్కడ ఉన్న చాక్లెట్లు, ఆహారం తినేసి నిద్రలోకి జారుకున్న ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం... ఇక్కడి అడయారు ప్రాంతంలోని ఓ భవనం మూడో అంతస్తులో కార్తీక్‌ నరేన్‌ అనే వ్యక్తి నివసిస్తుండగా, రెండో అంతస్తులోని మరో ఫ్లాట్‌లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం తీర్థయాత్రలకు వెళ్లారు. ఈ నెల 9న వారు తిరిగి వస్తుండటంతో నరేన్‌ వారి ఇంటి తాళం తీసి తన ఫ్లాట్‌కి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి తమ ఇంటికి చేరుకున్న ఈ జంటకు వారి ఇంట్లోనే ఓ వ్యక్తి నిద్రిస్తూ కనిపించాడు. అతడ్ని లేపడంతోనే అక్కడి నుంచి పారిపోయి మరో ఇంట్లోకి దూరాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి చోరీ చేసిన రూ.41 వేల నగదు, 20 విదేశీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితుడ్ని తిరువణ్ణామలైకి చెందిన ఏళుమలైగా గుర్తించారు. విల్లివాక్కంలో ఉంటూ భవన నిర్మాణ పనులకు వెళ్లే ఏళుమలై.. తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకి వచ్చి చోరీ చేశాడు. అక్కడ ఉన్న ఆహారం, ఫ్రిడ్జ్‌లో ఉన్న విదేశీ చాక్లెట్లు తిని మద్యం మత్తులో నిద్రపోయినట్లు తేలింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని