అమరేంద్ర కుమార్‌ చుట్టూ వివాదాలు

పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అచ్చెన్న హత్య కేసులో... ఆ శాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ వ్యవహారశైలిపై తీవ్ర చర్చ నడుస్తోంది.

Published : 01 Apr 2023 04:54 IST

తనకేమైనా జరిగితే ఆయనే బాధ్యుడని లేఖలో పేర్కొన్న అచ్చెన్న

ఈనాడు, అమరావతి: పశుసంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అచ్చెన్న హత్య కేసులో... ఆ శాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ వ్యవహారశైలిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన్ను సస్పెండ్‌ చేసి విచారణ చేయాలని ప్రజాసంఘాల నేతలు డిమాండు చేస్తున్నారు. హత్య ఘటన వెలుగు చూసినప్పటి నుంచి అమరేంద్ర చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తనకు ఏమైనా జరిగితే డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌తో పాటు డీఏహెచ్‌ శారదమ్మ బాధ్యులని అచ్చెన్న.. తన మరణానికి ముందు డైరెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి మానసికంగా కుంగిపోయే పరిస్థితికి తెచ్చారని, ఆ పరిస్థితికి కారకులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్న కుమారుడు క్లింటన్‌ చక్రవర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల పాత్రపై అనుమానం వెలిబుచ్చారు. ఫిర్యాదులోనూ మొదటగా అమరేంద్ర కుమార్‌ పేరునే ప్రస్తావించినా.. తర్వాత దాన్ని కొట్టేయించారని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. అచ్చెన్న కనిపించకుండా పోయిన తర్వాత.. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అచ్చెన్న హత్యకేసులో నియమించిన విచారణ కమిటీలో సభ్యులూ ఆయనకు సన్నిహితులని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను పదవి నుంచి తొలగిస్తేనే నిష్పాక్షిక విచారణ జరుగుతుందని పలువురు డిమాండు చేస్తున్నారు.

గతంలోనూ వివాదాలు

పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌ గతంలోనూ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. కాపు కార్పొరేషన్‌ ఎండీగా ఉన్నప్పుడు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అప్పటి ఛైర్మన్‌తో విభేదాలు తలెత్తాయి. పెద్దఎత్తున రచ్చ జరగడంతో.. అప్పటి ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది.

అమరేంద్రపై ఆరోపణలు సత్యదూరం

డిప్యూటీ డైరెక్టర్‌ చిన్న అచ్చెన్న మరణానికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధకశాఖ అధికారుల సర్వీసు అసోసియేషన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులో పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్ర కుమార్‌పై ఆరోపణలు సత్యదూరమని, దీనిలో రాజకీయాలు లేకుండా దోషుల్ని కఠినంగా శిక్షించాలని సంఘం అధ్యక్షుడు ఎస్‌.జయచంద్ర డిమాండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని