Cyber Crime: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి రూ.86 లక్షల టోకరా

పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరిట ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. మొదట ఆన్‌లైన్‌లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్‌, రివ్యూలు ఇవ్వాలని నమ్మించి, చివరికి క్రిప్టో పెట్టుబడుల పేరిట రూ.86.96 లక్షలు స్వాహా చేశారు.

Updated : 26 Nov 2023 07:02 IST

ఈనాడు- హైదరాబాద్‌: పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరిట ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి సైబర్‌ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. మొదట ఆన్‌లైన్‌లో హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్‌, రివ్యూలు ఇవ్వాలని నమ్మించి, చివరికి క్రిప్టో పెట్టుబడుల పేరిట రూ.86.96 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి గత నెల చివరివారంలో ఓ వాట్సప్‌ మెసేజ్‌ వచ్చింది. ఎన్‌ఐఈఎల్‌ఐటీ సంస్థ మానవ వనరుల విభాగం నుంచి మాట్లాడుతున్నామని.. గూగుల్‌లో హోటళ్లు, రెస్టారెంట్లకు రివ్యూలు ఇస్తే రోజూ డబ్బు జమ చేస్తామని అందులోని సారాంశం. ఈ మేరకు వారు పంపిన లింకుల ఆధారంగా కొన్ని రివ్యూలు రాయగా కొంత డబ్బు పంపించారు. తర్వాత క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలంటూ మభ్యపెట్టి ఒక లింకు ఇచ్చారు. బాధితుడు అందులో లాగిన్‌ అయ్యి.. మొదట రూ.వెయ్యి పెట్టుబడి పెట్టగా, తిరిగి రూ.1,420 చెల్లించారు. దీంతో నమ్మకం ఏర్పడి దఫదఫాలుగా రూ.86.96 లక్షలు పెట్టుబడి పెట్టారు. కానీ రూ.9,970 మాత్రమే తిరిగి ఇచ్చారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని