మైనింగ్‌ సొమ్ము మింగేశారు

గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది.

Published : 07 May 2024 07:05 IST

లీజుల ఈ-వేలం సెక్యూరిటీ డిపాజిట్‌ను ఓ ఖాతాలోకి మళ్లించి.. వాడేసుకున్నారు
నలుగురి అరెస్ట్‌... పరారీలో మరొకరు
అత్యంత గోప్యంగా ఉంచిన విజయవాడ నగర పోలీసులు

ఈనాడు, అమరావతి: గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. కొన్ని నెలలుగా ఈ దందా సాగినా గనులశాఖ సంచాలకుని కార్యాలయ అధికారులు గుర్తించలేక పోయారు. ఈ-వేలం డిపాజిట్‌ను వెనక్కి ఎందుకు ఇవ్వలేదని ఓ లీజుదారుడు అడగడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా దీనిపై విజయవాడ పోలీసులు విచారణ సాగిస్తున్నా, ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసినా.. ఎటువంటి సమాచారమూ బయటకు రాకుండా రహస్యంగా ఉంచడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మైనింగ్‌ లీజులకు ఈ-వేలం నిర్వహించినప్పుడు.. అందులో పాల్గొనేవారు సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ-వేలంలో ఎల్‌-1గా నిలిచిన గుత్తేదారుకు లీజును ఖరారుచేసి, ఎల్‌వోఏ జారీచేశాక.. అతడు వేలంలో కోట్‌ చేసిన మొత్తాన్ని చెల్లించాలి. తర్వాత ఆ లీజుదారుడితోపాటు, వేలంలో పాల్గొన్న వారు చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్‌ను వెనక్కి ఇచ్చేస్తారు. ఇలా కొందరికి వెనక్కి ఇవ్వాల్సిన రూ.5 కోట్లను.. గనులశాఖ ఖాతా నుంచి గుంటూరుకు చెందిన ఓ ఇసుకు గుత్తేదారు ఖాతాలోకి మళ్లించినట్లు సమాచారం. గనులశాఖ సంచాలకుని కార్యాలయంలో ఈ-వేలం విభాగం, ఐటీ విభాగాల పొరుగుసేవల ఉద్యోగులే ఇదంతా చేసినట్లు తెలిసింది. ఇసుక గుత్తేదారు ఖాతాలోకి వెళ్లిన సొమ్మును, మరో బ్యాంక్‌ ఖాతా తెరిచి అందులోకి మళ్లించి వాడేసుకున్నారని సమాచారం. 

లీజుదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి

ఈ-వేలంలో పాల్గొన్న విజయనగరానికి చెందిన ఒకరికి.. లీజు దక్కలేదు. సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించిన సొమ్మును సిబ్బంది ఎంత కాలమైనా వెనక్కి ఇవ్వలేదు. దీంతో ఆయన ఈ విషయాన్ని గనులశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏం జరిగిందా... అని అధికారులు ఆరా తీశారు. కంప్యూటర్‌ ఆపరేటర్లు సొమ్మును దారి మళ్లించినట్లు గుర్తించారు. దీనిపై ఇబ్రహీంపట్నంలోని పోలీసులకు వారం కిందట ఫిర్యాదు అందింది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేకంగా ఈ కేసు విచారణ చేయిస్తున్నట్లు తెలిసింది. సొమ్ము స్వాహాకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల బ్యాంకు ఖాతాల్ని పరిశీలించి.. వారు ఖర్చుచేయని కొంత సొమ్మును ఫ్రీజ్‌ చేయించారు. బాధ్యులైన ఇద్దరు పొరుగు సేవల సిబ్బందిని అరెస్ట్‌చేశారు. గుంటూరుకు చెందిన ఇసుక గుత్తేదారును, అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్‌చేసి... నలుగురినీ రిమాండ్‌కు పంపారు.

అవినాష్‌రెడ్డి సిఫారసుతో చేరి..

ఈ బాగోతంలో కీలక పాత్ర పోషించిన ప్రొద్దుటూరుకు చెందిన మరో పొరుగు సేవల ఉద్యోగి పరారీలో ఉన్నాడు. అతను కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సిఫారసుతో గతంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)లో చేరాడు. చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలకు చెందిన కీలక ప్రజాప్రతినిధుల సిఫారసులతో గతంలో అవసరం లేకపోయినా వందల సంఖ్యలో పొరుగుసేవలు, కాంట్రాక్ట్‌ విధానంలో ఉద్యోగుల్ని నియమించారు. ఇప్పుడు రూ.5 కోట్లు స్వాహాచేసిన వారు అలా నియమితులైనవారే. వీరంతా ఏపీఎండీసీ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి గనులశాఖ సంచాలకుని కార్యాలయంలో పనిచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని