Suicide Attempt: క్షణాల్లో ఉరికారు.. ఉరి నుంచి తప్పించారు

జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదండ్రులు, స్నేహితులతో వీడియోకాల్‌ మాట్లాడుతూ ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఓ యువతిని చివరి నిమిషంలో హైదరాబాద్‌ పోలీసులు కాపాడారు.....

Published : 29 Oct 2021 07:32 IST

మాజీ మిస్‌ తెలంగాణ ఆత్మహత్యాయత్నం
వీడియో కాల్‌ మాట్లాడుతూ అఘాయిత్యం
స్నేహితుల సమాచారంతో కాపాడిన పోలీసులు

ఆత్మహత్యాయత్నం చేస్తున్న హాసిని

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, నారాయణగూడ, జూబ్లీహిల్స్‌: జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదండ్రులు, స్నేహితులతో వీడియోకాల్‌ మాట్లాడుతూ ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఓ యువతిని చివరి నిమిషంలో హైదరాబాద్‌ పోలీసులు కాపాడారు. ఆమె అఘాయిత్యాన్ని చూసిన స్నేహితుడు ఒకరు మెరుపులా స్పందించి.. డయల్‌ 100కు ఫోన్‌ చేసి చెప్పడంతో పోలీసులు క్షణాల్లో ఆ యువతి ఫ్లాట్‌కు వెళ్లి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేది. ఆబిడ్స్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్‌ హాసిని ఓ ప్రైవేటు సంస్థ 2018లో నిర్వహించిన పోటీలో ‘మిస్‌ తెలంగాణ’గా ఎంపికయ్యారు. హిమాయత్‌నగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఒంటరిగా ఉంటూ మోడలింగ్‌ చేస్తున్నారు. బుధవారం రాత్రి 10:30 గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి బిగించుకొని తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో కాల్‌ (కాన్ఫరెన్స్‌) చేశారు. కంగారుపడిన తల్లిదండ్రులు, స్నేహితులు ఫోన్‌లు చేస్తున్నా పట్టించుకోకుండా ఆమె తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతూనే ఉన్నారు. ‘ఆత్మహత్య తప్పని తెలుసు. అమ్మా, నాన్న మన్నించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాకు ఎవరూ అవసరం లేదు, ఒకసారి యాసిడ్‌ దాడి యత్నాన్ని, మరోసారి వేధింపుల్ని.. ఆపై ఎంతోమంది నుంచి రకరకాల వ్యాఖ్యలను ఎదుర్కొన్నా.. అందరికీ గుడ్‌ బై ఫర్‌ ఎవర్‌’’ అని చెబుతూ.. కాళ్లకింద ఉన్న స్టూల్‌ను తన్నేశారామె. ఇదంతా చూస్తున్న జగిత్యాలలోని ఆమె స్నేహితుడొకరు వెంటనే 100కు ఫోన్‌ చేశారు. ఈ సమాచారం అందగానే నారాయణగూడ పోలీసులు శివప్రసాద్‌, మధు ఆగమేఘాలపై ఆమె ఉండే అపార్టుమెంట్‌కు చేరుకున్నారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. మెడకు బిగించుకున్న చున్నీ ముడి అదృష్టవశాత్తు విడిపోవడంతో ఆమె మంచంపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న హాసినిని ఎందుకు ఆత్మహత్యయత్నం చేశారని ప్రశ్నించగా.. ఆర్థిక ఇబ్బందులని తెలిపినట్లు పోలీసు అధికారి రవికుమార్‌ చెప్పారు. గురువారం ఉదయం ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చి హాసినిని తమ స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం బోజ్వాడకు తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని