అప్పుల భారంతో రైతు బలవన్మరణం

పంటల పెట్టుబడులకు తెచ్చిన అప్పులు పెరగడం.. పండగ చేసుకునే పరిస్థితి లేదని మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన మన్నెం(45)కు 5 ఎకరాల పొలం ఉంది.

Updated : 28 Nov 2021 07:35 IST

పెద్దమందడి, న్యూస్‌టుడే: పంటల పెట్టుబడులకు తెచ్చిన అప్పులు పెరగడం.. పండగ చేసుకునే పరిస్థితి లేదని మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వనపర్తి జిల్లా పెద్దమందడికి చెందిన మన్నెం(45)కు 5 ఎకరాల పొలం ఉంది. దీంతో పాటు గత ఏడాది యాసంగి వరకు 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వేరుసెనగ, వరి సాగు చేసేవారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో తన సొంత పొలంలో వేసిన వరి పంటకు తెగులు సోకి ఎకరానికి సుమారు 36 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 10-15 క్వింటాళ్లే వచ్చింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు రూ.5 లక్షల వరకు పెరిగాయి. బొడ్రాయి పండగ సందర్భంగా ఇద్దరు ఆడబిడ్డలను, బంధువులను పిలుద్దామని భార్య ఈ నెల 20న కోరింది. అసలే అప్పులున్నాయని, ఎలా పిలవాలని అతను చెప్పడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మనస్తాపానికి గురైన మన్నెం అదే రోజు పురుగు మందు తాగారు. ఆయనను వనపర్తి జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. భార్య అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మన్నెంకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వారెవరికీ వివాహాలు కాలేదు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని