Andhra News: వైద్యుడు రాసిందొకటి.. దుకాణదారు ఇచ్చింది మరొకటి.. చివరికి!

వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీని తీసుకొని దుకాణానికి వెళ్లిన వారికి దుకాణదారుడు వేరే రకం మందులు ఇవ్వడంతో వాటిని రోజూ మింగుతూ వచ్చిన ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందారు.

Updated : 07 Mar 2022 07:38 IST

రాజంపేట, న్యూస్‌టుడే: వైద్యుడు రాసిచ్చిన మందుల చీటీని తీసుకొని దుకాణానికి వెళ్లిన వారికి దుకాణదారుడు వేరే రకం మందులు ఇవ్వడంతో వాటిని రోజూ మింగుతూ వచ్చిన ఓ వృద్ధురాలు తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందారు. ఈ ఘటన కడప జిల్లాలోని రాజంపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేటలోని ఎర్రబల్లికి చెందిన కె.సుబ్బనరసమ్మ (67)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గతేడాది డిసెంబరులో కడపలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల తర్వాత థైరాయిడ్‌ సమస్య ఉందని వైద్యులు ధ్రువీకరించారు. వ్యాధి నివారణకు గాను వైద్యుడు మందులు రాసిచ్చారు. సదరు వృద్ధురాలి కుమారుడు సుధాకరాచారి ఆ చీటీతో డిసెంబరు 27న రాజంపేటలోని ఓ మెడికల్‌ స్టోర్‌కు వెళ్లి మందులు తీసుకొచ్చారు. వాటిని రోజూ మింగిన వృద్ధురాలికి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి మరోసారి వైద్యుడిని కలిశారు. వైద్యుడు యాంటీ థైరాక్సిన్‌ 10 ఎంజీ రాసిస్తే, థైరాక్సిన్‌ సోడియం 100 ఎంజీ మందులు మింగడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. గత నెల 24న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఔషధ దుకాణంపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమెను నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 5న మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని