పైవంతెన నుంచి పడిన కారు

వరంగల్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో దంపతులు, ఇద్దరు మహిళాకూలీలు సహా అయిదుగురు అక్కడికక్కడే

Published : 23 May 2022 09:33 IST

మరో వాహనాన్ని ఢీకొని 40 అడుగుల పైనుంచి కిందకు

ఇద్దరి దుర్మరణం

మరో ఘటనలో ముగ్గురి మృతి

వరంగల్‌ జిల్లా పరిధిలో దుర్ఘటనలు

కరీమాబాద్‌, మామునూరు, వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో దంపతులు, ఇద్దరు మహిళాకూలీలు సహా అయిదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వరంగల్‌- ఖమ్మం జాతీయ రహదారిపై అయిదు కిలోమీటర్ల పరిధిలో గంటల వ్యవధిలో ఈ దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఖిలావరంగల్‌ మండలం అల్లీపురానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఎస్‌కే యాకూబ్‌పాష అలియాస్‌ బబ్లూ(23), ఎల్కతుర్తి మండలం దండెపల్లికి చెందిన పల్లపు పద్మ(35), హనుమకొండ వినాయకనగర్‌కు చెందిన వల్లెపు మీన(28) ఆటోలో వర్ధన్నపేట నుంచి వరంగల్‌ వస్తున్నారు. పద్మ, మీన స్నేహితులు. ఇద్దరూ కలిసి లారీల నుంచి ఇసుక తోడే పనులకు వెళ్తుంటారు. తెల్లవారుజామున నాలుగైదు గంటల మధ్య వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం వారి ఆటోను బలంగా ఢీకొట్టి పోవటంతో అందులోని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో తునాతునకలైంది.

వారాంతంలో స్వస్థలానికి వెళుతూ...
వరంగల్‌ హంటర్‌ రోడ్డు పైవంతెనపై జరిగిన కారు ప్రమాదంలో వారాంతం వేళ సొంతూరు వెళుతున్న దంపతులు దుర్మరణం చెందారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం రాజపల్లికి చెందిన తాడూరి సారయ్య(55) ఖమ్మం జిల్లాలో గ్రామీణ నీటిసరఫరా పథకంలో టెక్నికల్‌ అధికారి. భార్య సుజాత(54)తో కలిసి ఖమ్మంలో నివాసముంటున్నారు. వారి కుమారుడు వినయ్‌కుమార్‌ కరీంనగర్‌లో ఉద్యోగం చేస్తుంటారు. వివాహిత అయిన కుమార్తె దివ్యరాణి కూడా ఖమ్మంలోనే ఉంటారు. ఆదివారం తెల్లవారుజామున సారయ్య, సుజాతలు ఖమ్మం నుంచి తమ కారులో సొంతూరికి బయలుదేరారు. కొత్తగా వచ్చిన డ్రైవర్‌ షేక్‌ ఖాసీంవలీ దాన్ని నడుపుతున్నారు. ఉదయం సమయంలో వరంగల్‌ కరీమాబాద్‌ వద్ద ఖమ్మం బైపాస్‌ హంటర్‌ రోడ్డు పైవంతెనపై వారి కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. 40 అడుగుల పైనుంచి కిందపడింది. కారులో ఉన్న సుజాత(54) అక్కడిక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సారయ్య, డ్రైవర్‌ ఖాసింవలీని 108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సారయ్య మృతిచెందారు. డ్రైవర్‌ ఖాసింవలీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని