Suicide: ఒప్పందం మేరకు షోరూం నిర్వాహకులు కారు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

కారు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఆశలు అడియాసలు కావడం, షోరూం నిర్వాహకులు ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో

Updated : 04 Jul 2022 08:21 IST

ఎల్లారెడ్డి పురపాలిక, న్యూస్‌టుడే: కారు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఆశలు అడియాసలు కావడం, షోరూం నిర్వాహకులు ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన తెలగాపురం కృష్ణ(21) కారు కొనుగోలు చేసి అద్దెకు తిప్పాలని నిర్ణయించుకున్నారు. కారు ధర రూ.8,71,000 కాగా రూ.2.5 లక్షలు డౌన్‌పేమెంట్‌గా చెల్లించేందుకు పట్టణంలోని ఓ షోరూంలో ఒప్పదం చేసుకున్నారు. మే 23న రూ.50 వేలు చెల్లించాడు. జులైలో రూ.2 లక్షలు చెల్లించి కారును తీసుకెళ్లాలని నిర్వాహకులు సూచించారు. రూ.2 లక్షలు సమకూర్చుకుని షోరూంకు వెళ్లగా.. నిర్వాహకులు మరో రూ.50 వేలు చెల్లించాలని కోరారు. కారు ఇవ్వడానికి సమయం పడుతుందని వెల్లడించారు. దీంతో కారు కొనుగోలు చేస్తున్నాననే సంతోషం యువకుడిలో నీరుగారిపోయింది. షోరూం నిర్వాహకులు తనను మోసం చేశారని కలత చెంది ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై ఆయన సోదరుడు శివకుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని