కేసులు పెట్టారు.. రాత్రంతా స్టేషన్లో ఉంచారు

తమకు పథకాలేవీ అందడం లేదని చెప్పిన తెదేపా సానుభూతిపరులపై ఎమ్మెల్యే పరుషంగా మాట్లాడి.. చేతిలో ఉన్న పుస్తకాన్ని వారిపైకి విసిరికొట్టారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన పోలీసులు వారిని తీసుకెళ్లి,

Updated : 26 Sep 2022 06:19 IST

పుస్తకం విసిరికొట్టిన ఎమ్మెల్యే

తెదేపా సానుభూతిపరులపై ఎస్సీ, ఎస్టీ కేసులు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: తమకు పథకాలేవీ అందడం లేదని చెప్పిన తెదేపా సానుభూతిపరులపై ఎమ్మెల్యే పరుషంగా మాట్లాడి.. చేతిలో ఉన్న పుస్తకాన్ని వారిపైకి విసిరికొట్టారు. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన పోలీసులు వారిని తీసుకెళ్లి, రాత్రంతా స్టేషన్‌లో ఉంచారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంటలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు... ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా లింగంగుంట పంచాయతీ పరిధి బెజవాడవారిపాలెంలో శనివారం రాత్రి 9.30 సమయంలో పర్యటించారు. ఈ క్రమంలో ఆటోడ్రైవర్‌, తెదేపా సానుభూతిపరుడైన చల్లా వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి... గత ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని, అన్నీ తామే ఇచ్చామని అనడంతో వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు. గతంలోనే తమకు పథకాలన్నీ అందాయని, ఇప్పుడే ఏమీ ఇవ్వలేదని చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటామాటా పెరగడంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే తన చేతిలో ఉన్న పుస్తకం, కాగితాలను విసిరికొట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంకటేశ్వర్లు కుటుంబీకులు గట్టిగా నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులు వెంకటేశ్వర్లును, ఆయన సోదరుడు విజయ భాస్కర్‌ను తీసుకెళ్లారు. తర్వాత మేళం శ్రీకాంత్‌ అనే వ్యక్తి... వెంకటేశ్వర్లు, విజయ భాస్కర్‌ తనను కులం పేరుతో దూషించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.

రాత్రంతా స్టేషన్‌లోనే..: వెంకటేశ్వర్లు, విజయ భాస్కర్‌ను రాత్రంతా స్టేషన్‌లోనే ఉంచారు.ఇది తెలిసిన తెదేపా నాయకులు ఆదివారం ఉదయం అక్కడకు చేరుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తే ఇంటి దగ్గరే విచారణ జరపాలి తప్ప స్టేషన్‌కు తరలించడం ఏంటని నిలదీశారు. ఎస్సై శ్రీరాం స్పందిస్తూ... గ్రామంలో ‘గడప గడపకూ...’ కార్యక్రమం జరుగుతున్నందున గొడవలకు తావులేకుండా వారిని స్టేషన్‌లో ఉంచినట్లు చెప్పారు. తెదేపా నాయకులు పట్టుబట్టడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వారిని విడిచిపెట్టారు.


వాస్తవం చెబితే కొట్టి, కేసులు పెడతారా?: నేను ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వ పథకాలు అందలేదని చెప్పడంతో ఎమ్మెల్యే నాపై చేయి చేసుకున్నారు. నన్నెందుకు కొట్టారని అడిగినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. పోలీసులు రాత్రంతా స్టేషన్‌లో ఉంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.

- చల్లా వెంకటేశ్వర్లు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని