తెలుగు యువకులతోనే.. సైబర్‌ వల

హలో హలో అంటూ ఫోన్‌ చేసి అచ్చ తెలుగులో మాట్లాడతారు.. అంతే నమ్మకంగా ఆకట్టుకుంటారు.. వారి భాష.. యాస.. మన ప్రాంతానిదే కావడంతో అమాయకులు సులువుగా వారి ఉచ్చులో చిక్కుకుని

Published : 30 Sep 2022 05:38 IST

నేరగాళ్ల కొత్త ఎత్తుగడ

కాల్‌ సెంటర్ల ఉచ్చులో ఏపీ, తెలంగాణ యువకులు

వారితో ఫోన్‌లు చేయించి మోసాలు

హలో హలో అంటూ ఫోన్‌ చేసి అచ్చ తెలుగులో మాట్లాడతారు.. అంతే నమ్మకంగా ఆకట్టుకుంటారు.. వారి భాష.. యాస.. మన ప్రాంతానిదే కావడంతో అమాయకులు సులువుగా వారి ఉచ్చులో చిక్కుకుని సర్వం కోల్పోతున్నారు. ఇలా సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తూ తెలుగు యువకులతో మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో హిందీ, ఇంగ్లిష్‌ వచ్చిన వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న సైబర్‌ ముఠాలు కొత్త వ్యూహాలు పన్నుతున్నాయి. ఝార్ఖండ్‌, రాజస్థాన్‌, దిల్లీ, కోల్‌కతాలలోని సైబర్‌ నేరగాళ్ల అడ్డాల్లో వందల మంది తెలుగువారు పనిచేస్తున్నారు. వీరికి శిక్షణ ఇచ్చి తెలుగు రాష్ట్రాల ప్రజలపై ప్రయోగిస్తున్నాయి. ఇటీవల రాచకొండ పోలీసులు కోల్‌కతాలోని ఓ కాల్‌సెంటర్‌పై దాడి చేసినప్పుడు అనేకమంది తెలుగు యువకులు కనిపించారు. దాంతో సైబర్‌ నేరాలకు పాల్పడిన వారిలో తెలుగువారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏపీ, తెలంగాణకు చెందిన యువకులను సైబర్‌ ముఠాలు ఉత్తరాదికి రప్పిస్తున్నాయి. అక్కడ వీరికి సైబర్‌ నేరాలు ఎలా చేయాలో నేర్పించి మరీ తెలుగు రాష్ట్రాల్లోని అమాయకులను దోచుకుంటున్నాయి.

నిదర్శనాలివే..
* కొద్దిరోజుల కిందట ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు బిహార్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులను విచారించినపుడు ఉద్యోగాలిస్తామంటూ వీరిని తీసుకెళ్లినట్లు చెప్పారు. కానీ పోలీసు దర్యాప్తులో వీరు సైబర్‌ నేరగాళ్ల వద్ద పనిచేస్తున్నట్లు తేలింది.

* కోల్‌కతాలో రాచకొండ పోలీసులు సోదాలు నిర్వహించినప్పుడు అనేకమంది తెలుగువారు పట్టుబడ్డారు. సైబర్‌ నేర కేంద్రాలైన జాంతారతో పాటు రాజస్థాన్‌, దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల మంది తెలుగు యువకులు పనిచేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

తెలంగాణలో నేరాల తీవ్రత
ఫోన్‌కాల్స్‌, వాట్సప్‌ ఛాటింగ్‌, ఫేస్‌బుక్‌ రిక్వెస్టుల వంటి వాటితోనే సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి.. బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోవడం, వస్తువులు అమ్ముతామని చెబుతూ డబ్బు కొట్టేయడం, బహుమతి వచ్చిందంటూ క్యూఆర్‌ కోడ్‌ పంపించి ఉన్న సొమ్మంతా ఊడ్చేయడం వంటి నేరాలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ వీటి తీవ్రత తెలంగాణలో ఎక్కువగా ఉంది. ఉత్తరాదికి చెందిన సైబర్‌ నేరగాళ్లు పెద్దగా చదువుకోరు. హిందీ తప్ప వేరే భాష రాదు. తెలంగాణలో హిందీ మాట్లాడేవారు ఎక్కువ. దాంతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై ఇక్కడి జనానికి అవగాహన అధికం. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, యూపీఏ చెల్లింపులు, సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండటం ఇక్కడ మామూలు విషయం. ఇవన్నీ సైబర్‌ నేరగాళ్లకు అనుకూలాంశాలు. అందుకే జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌.సి.ఆర్‌.బి.) నివేదిక ప్రకారం 2021లో దేశం మొత్తంమీద అత్యధికంగా 10,303 సైబర్‌ నేరాలు తెలంగాణలో నమోదయ్యాయి. ఇక మెట్రో నగరాల విషయానికి వస్తే 3,303 కేసులతో హైదరాబాద్‌ రెండోస్థానంలో ఉంది.

చైనా రుణయాప్‌ల ఊబిలోనూ
చైనా రుణయాప్‌ సంస్థలు నిర్వహించే కాల్‌సెంటర్లలోనూ తెలుగువారు పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సంస్థలు దిల్లీ చుట్టుపక్కల కాల్‌సెంటర్లు నిర్వహించేవి. పోలీసులు పదేపదే దాడులు చేస్తుండటంతో చైనా సంస్థలు మయన్మార్‌, థాయ్‌లాండ్‌, కాంబోడియా తదితర దేశాలకు తమ కార్యకలాపాలు తరలించినట్లు తెలుస్తోంది. ఉద్యోగం ఇస్తామని చెబుతూ విదేశాలకు తీసుకెళ్లి, అక్కడ పాస్‌పోర్టు లాక్కొని వెట్టిచాకిరీ చేయిస్తుండటంతో భారత విదేశాంగశాఖ రంగంలోకి దిగింది

మాయమాటలు నమ్మొద్దు
కాల్‌సెంటర్లో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెబితే ఎవరూ నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అరకొర విద్యార్హతలే ఉన్నాయని తెలిసినా ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే నిరుద్యోగులు అనుమానించాల్సిందేనని పేర్కొంటున్నారు. ఒక్కసారి ఇలాంటి ముఠాల వలలో చిక్కుకుంటే బయటపడటం కష్టమని వారు హెచ్చరిస్తున్నారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని