డీకే ఆదికేశవులనాయుడు కుమారుడిపై సీబీఐ కేసు

బెంగళూరులో స్థిరపడ్డ చిత్తూరు జిల్లా చెందిన స్థిరాస్తి వ్యాపారి కె.రఘునాథ్‌ హత్య ఘటనకు సంబంధించి దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు కుమారుడు డీఏ శ్రీనివాస్‌తో పాటు మరికొందరిపై సీబీఐ శుక్రవారం కేసులు నమోదు చేసింది.

Published : 01 Oct 2022 05:52 IST

బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారి హత్య ఘటనలో నమోదు

ఈనాడు, అమరావతి: బెంగళూరులో స్థిరపడ్డ చిత్తూరు జిల్లా చెందిన స్థిరాస్తి వ్యాపారి కె.రఘునాథ్‌ హత్య ఘటనకు సంబంధించి దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు కుమారుడు డీఏ శ్రీనివాస్‌తో పాటు మరికొందరిపై సీబీఐ శుక్రవారం కేసులు నమోదు చేసింది. రఘునాథ్‌ భార్య మంజుల, కుమారుడు రోహిత్‌ ఫిర్యాదుల ఆధారంగా.. హత్య, నేరపూరిత కుట్ర, ఆధారాలు మాయం చేయటం, ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి తదితర అభియోగాలతో వారిపై రెండు వేర్వేరు కేసులు పెట్టింది. డీఏ శ్రీనివాస్‌, మరికొందరు తన భర్తను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, ఆయన చనిపోయిన తర్వాత ఫోర్జరీ వీలునామా సృష్టించి విలువైన ఆస్తులను వారి పేరిట అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారంటూ రఘునాథ్‌ భార్య, కుమారుడు 2019లో కర్ణాటక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు లేకపోవటంతో వారు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని హైకోర్టు సీబీఐని ఇటీవల  ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం సీబీఐ కేసులు నమోదు చేసింది. డీఏ శ్రీనివాస్‌తో పాటు బెంగళూరు వాసి ఎ.దామోదర్‌, చిత్తూరు జిల్లా సదుం మండలం తిమ్మన్నపల్లెకు చెందిన రామచంద్రయ్య (ఈయన రఘునాథ్‌ తండ్రి), ప్రతాప్‌లను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. ఫోర్జరీ పత్రాల ఆధారంగా ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేసిన కర్ణాటక స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులపై కూడా మరో కేసు నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని