పండగ పూట పిడుగుల వాన.. ఆరుగురి మృతి

ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో దసరా పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో ఆరుగురు మృతిచెందారు.

Published : 07 Oct 2022 05:00 IST

వరంగల్‌ జిల్లాలో ఒకే ఘటనలో ముగ్గురు..

వర్ధన్నపేట, జఫర్‌గఢ్‌, గార్ల, పెనుబల్లి, నేలకొండపల్లి-న్యూస్‌టుడే: ఖమ్మం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో దసరా పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడటంతో ఆరుగురు మృతిచెందారు. నలుగురు గాయాలపాలయ్యారు. వరంగల్‌ జిల్లాలో ఒకే ఘటనలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన మరుపట్ల సాంబరాజు, నేరుళ్లి శివకృష్ణ, జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన జిట్టబోయిన సాయికుమార్‌, నేరెళ్లి వంశీకృష్ణ, వొజ్జల సందీప్‌లు స్నేహితులు. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతూ పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేసే వీరంతా బుధవారం దసరా పండగ సందర్భంగా జఫర్‌గఢ్‌ మండలం సాగరం శివారులో విందు చేసుకున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో వర్షం పడుతుండటంతో ఓ చెట్టు కింద ఆగారు. పిడుగుపడటంతో సాంబరాజు (23), శివకృష్ణ (22), సాయికుమార్‌ (23)లు అక్కడికక్కడే మృతి చెందారు. వంశీకృష్ణ, సందీప్‌ తీవ్రంగా గాయపడ్డారు.

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన వి.సంపత్‌ (27), శేఖర్‌, విజయ్‌, రమేష్‌ పండగ సందర్భంగా సీతంపేట శివారులోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. వర్షం పడుతుండటంతో రమేష్‌ మినహా మిగిలిన ముగ్గురు చెట్టు కిందకు చేరారు. ఆ సమయంలో పిడుగుపడి సంపత్‌, శేఖర్‌, విజయ్‌ తీవ్రగాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే సంపత్‌ మృతి చెందినట్లు ముల్కనూరు వైద్యాధికారి నిర్ధారించారు. స్థానిక వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతోనే సంపత్‌ మృతిచెందాడని గ్రామస్థులు, కుటుంబసభ్యులు ఆందోళన చేశారు.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామానికి చెందిన బల్లి యాకోబు (65) మేకలను మేపి  వస్తుండగా.. వర్షంతోపాటు పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. నేలకొండపల్లి మండలం అజయ్‌తండాలో బుధవారం కోళ్లను కప్పి పెట్టేందుకు ఇంట్లోంచి బయటకు వెళ్లిన మూడు జమ్ము (68) పిడుగుల శబ్దానికి భయపడి గుండె ఆగి మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని