Andhra News: ‘సంకల్ప సిద్ధి’ నిందితుల అరెస్టు

ఆయన లారీ క్లీనర్‌.. ఆస్తిపాస్తులు లేవు.. ఇది రెండేళ్ల కిందటి మాట. ప్రజల అత్యాశ పెట్టుబడిగా పెట్టి రూ.170 కోట్లు వసూలు చేసి చివరకు కటకటాలపాలయ్యాడు.

Updated : 29 Nov 2022 06:52 IST

దంపతులతో సహా ఐదుగురు అదుపులోకి..

ఈనాడు, అమరావతి, విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆయన లారీ క్లీనర్‌.. ఆస్తిపాస్తులు లేవు.. ఇది రెండేళ్ల కిందటి మాట. ప్రజల అత్యాశ పెట్టుబడిగా పెట్టి రూ.170 కోట్లు వసూలు చేసి చివరకు కటకటాలపాలయ్యాడు. ఆయనతోపాటు భార్య, చెల్లి, అన్న కుమారుడు, మరొకరు జైలుపాలయ్యారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొలుసుకట్టు సంస్థ ‘సంకల్పసిద్ధి’ ఈకార్ట్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కేసుకు సంబంధించి విజయవాడ పోలీసుల దర్యాప్తు కొలిక్కి వస్తోంది. కంపెనీ ఎండీ గుత్తా వేణుగోపాలకృష్ణ అలియాస్‌ వేణు, ఆయన భార్య.. డైరెక్టర్‌ లక్ష్మి, బాబాయి కుమారుడు గుత్తా కిషోర్‌, కంపెనీ మరో డైరెక్టర్‌.. వేణు సోదరి ఎం.వెంకటనాగలక్ష్మి, సీతానగరానికి చెందిన జాకీర్‌హుస్సేన్‌లను అరెస్టు చేశామని పోలీసు కమిషనర్‌ కాంతిరాణాటాటా సోమవారం విలేకరులకు తెలిపారు. 728 గ్రాముల బంగారం, తొమ్మిదిన్నర కిలోల వెండి, 51.60 లక్షల నగదు, రెండు కార్లు, పది సెల్‌ఫోన్లు, నాలుగు కంప్యూటర్లు, భూపత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

నిందితుడి నేపథ్యమిది...

కర్ణాటకకు చెందిన వేణుగోపాలకృష్ణ ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. విజయవాడకు వచ్చి చిన్నచిన్న పనులు చేసేవాడు. లారీ క్లీనర్‌గా పనిచేస్తూనే మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌లలో ఏజెంట్‌గా పనిచేస్తూ దానిపై అవగాహన పెంచుకున్నాడు. 2021 అక్టోబరులో విజయవాడ దుర్గాఅగ్రహారంలో ‘సంకల్ప్‌మార్ట్‌’ను ప్రారంభించాడు. 2022 మే నెలలో ‘సంకల్ప్‌ సిద్ధి ఈకార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ స్థాపించి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌, మార్కెటింగ్‌ వ్యాపారానికి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి అనుమతి పొందారు. ఆ ముసుగులో చట్టవిరుద్ధమైన మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌ నడిపారు. సభ్యులుగా చేరిన వారు మరికొందరిని చేర్పిస్తే ఆకర్షణీయమైన ఆదాయం వస్తుందని నమ్మించాడు. సూపర్‌మార్కెట్‌, బంగారం, ఓపెన్‌ ప్లాట్లు, ఎర్రచందనం మొక్కల ఆశ చూపుతూ రూ.కోట్లు సేకరించాడు. వ్యాపారం చేయకుండానే రొటేషన్‌ పద్ధతిలో పరిమితంగా తిరిగి చెల్లిస్తూ డబ్బును దారి మళ్లించాడు. చెల్లింపులు ఆలస్యం కావటంతో ఒక వినియోగదారుడి ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల విచారణలో పోలీసులు కొన్ని ఆస్తులను గుర్తించారు. నిందితుల పేరుపై ఉన్న బ్యాంకు ఖాతాలు, కొన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను వారు స్తంభింపజేశారు. నిందితులతోపాటు మరో ఇద్దరు లేదా ముగ్గురు కీలక భాగస్వాములు ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంపైనా చర్చ సాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని