‘సాహితీ ఇన్‌ఫ్రా’ మోసంపై ఈడీ కన్ను

ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో దాదాపు రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రా సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది.

Published : 05 Dec 2022 04:22 IST

కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల సేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో దాదాపు రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రా సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. పెద్దఎత్తున నిధుల మళ్లింపు జరిగిందని భావిస్తున్న ఈడీ ఇదివరకే కేసు నమోదు చేసింది. ఆ సంస్థలు కొనుగోలు చేసినట్లు భావిస్తున్న స్థలాలకు సంబంధించిన వివరాలు పంపాలంటూ సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌లకు లేఖలు రాసింది. వివరాలు అందిన తర్వాత ఆ ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రీలాంచ్‌ ఆఫర్ల పేరుతో సాహితీ సంస్థలు భారీగా డబ్బు వసూలు చేసినప్పటికీ వాటిలో చాలా ప్రాజెక్టులు మొదలుకూడా పెట్టలేదు. దాంతో డబ్బు కట్టిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఇటీవల సాహితీ ఎండీ లక్ష్మినారాయణను అరెస్టు చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనూ కేసులు నమోదయ్యాయి. స్థిరాస్తి వ్యాపారం పేరుతో ఇక్కడ వసూలు చేసిన డబ్బును ఇతర సంస్థల్లోకి మళ్లించినట్లు, ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఇలా చేయడం పీఎంఎల్‌ఏ చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి ఈడీ రంగంలోకి దిగింది. ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బు... వాటి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను సేకరిస్తోంది. నిధుల మళ్లింపు జరిగినట్లు ఆధారాలు లభించే పక్షంలో వాటి ద్వారా సమకూర్చుకున్న ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని