Hyderabad News: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌... నిందితులకు స్టార్‌ హోటల్‌ నుంచి బిర్యానీ

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. మరోవైపు విచారణ అనంతరం పోలీసులు

Updated : 12 Jun 2022 18:24 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. మరోవైపు విచారణ అనంతరం పోలీసులు ఐదుగురు మైనర్లను జువైనల్‌ హోమ్‌కు తరలించారు. 

ఇవాళ ఉదయం ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లను జువైనల్‌ జస్టిస్ బోర్డు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు.. వారిని ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. అమ్నేషియా పబ్‌, కాన్సూ బేకరీ, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36, 44 తదితర ప్రాంతాలకు నిందితులను తీసుకెళ్లి ఘటన ఎలా జరిగింది. ముందుగా బాలికను ఎవరు అప్రోచ్‌ అయ్యారు. ఎవరు అసభ్యంగా ప్రవర్తించారని అడిగి తెలుసుకున్నారు. కొన్ని కీలకమైన ఆధారాలను సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. పబ్‌లో జరిగిన ఘటనపై యాజమాన్యంతో పాటు ఆ సమయంలో విధుల్లో ఉన్న బౌన్సర్లను కూడా పోలీసులు విచారించారు. పబ్‌లో ఎంత సేపు ఉన్నారు? ఎప్పుడు బయటకు వెళ్లారు? ఏ కారులో బయటకు వెళ్లారు? కాన్సూ బేకరీకి ఎప్పుడు వెళ్లారు? అక్కడ ఎంతసేపు ఉన్నారు? అత్యాచారానికి ప్లాన్‌ చేసింది ఎవరు? తదితర విషయాలపై నిందితుల నుంచి వివరాలు రాబట్టినట్టు సమాచారం.

నిందితులకు స్టార్‌ హోటల్‌ నుంచి బిర్యానీ...

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అనంతరం నిందితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. మధ్యాహ్న సమయంలో నిందితులకు వారి బంధువులు స్టార్‌ హోటల్‌ నుంచి బిర్యాని తీసుకొచ్చారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులకు సాధారణంగా ఇలాంటి ఏర్పాట్లు చేయరు. కొన్ని ప్రత్యేక కేసుల్లో వీవీఐపీలకు మాత్రమే ప్రత్యేక భోజన ఏర్పాట్లకు అనుమతిస్తారు. ఈకేసులో వీఐపీ నిందితులు కావడంతోనే బిర్యానీతో భోజనం ఏర్పాట్లు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అత్యాచారం కేసులో ఉన్న నిందితులకు ఇలాంటి మర్యాదలు చేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదుద్దీన్‌ను ఈనెల 10 నుంచి జూబ్లీహిల్స్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో సాదుద్దీన్‌ చెప్పిన వివరాల ఆధారంగా మైనర్లను కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగానే వారిని సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారు చెప్పిన వివరాలను బట్టి మళ్లీ పీఎస్‌కు తీసుకెళ్లి విచారణ కొనసాగించనున్నారు. నిందితులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు విచారించారు. అనంతరం జువైనల్‌ హోమ్‌కు తరలించారు. ఇందులో ఇద్దరు మైనర్లకు రెండో రోజు విచారణ, ముగ్గురు మైనర్లకు మూడో రోజు విచారణ పూర్తయింది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో అతని ప్రమేయం ఎంతవరకు ఉంది? మైనర్లు ఎంత వరకు సహకరించారు? మైనర్లను సాదుద్దీన్‌ ఎలా ప్రోత్సహించాడనే దానిపై పలు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. సాదుద్దీన్‌ మాలిక్‌ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లోనే ఉన్నారు. రేపు ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి అక్కడి నుంచి  చంచల్‌గూడ జైలుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని