
బైక్‌పై మృతదేహాన్ని తీసుకెళుతున్న యువకుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇంటర్నెట్ డెస్క్: కర్నూలు జిల్లా పాణ్యం జాతీయ రహదారిపై ఓ బైక్ వేగంగా దూసుకుపోతోంది. బైక్ పై ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అయితే అమ్మాయి పడుకున్న స్థితిలో ఉంది. చూడగానే అనుమానించిన జాతీయ రహదారి పెట్రోలింగ్ పోలీసులు.. వెంటనే బైక్‌ను ఆపారు. బైక్ మీదున్న యువతిని పరిశీలించారు. ఆమె పరిస్థితిపై యువకుడిని ఆరా తీశారు. ఆ యువకుడు చెప్పిన సమాధానాలు సరిగా లేకపోవడంతో అనుమానం ఇంకా పెరిగింది. యువతిని మరింత జాగ్రత్తగా పరిశీలించారు. ఆమె శరీరంపై గాయాలను గుర్తించారు. యువకుడిని గట్టిగా నిలదీయగా తత్తరపాటుకు గురయ్యాడు. సందేహంతో ఆమె శ్వాస తీసుకుంటోందా.. లేదా.. అని చూశారు. శ్వాస ఆడటంలేదని నిర్ధరించుకున్న పోలీసులు.. అమె అప్పటికే చనిపోయినట్టు తేల్చారు. ఆ యువకుడిని ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చనిపోయిన యువతి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన సుంకన్న, అయ్యమ్మ దంపతుల కుమార్తె అరుణగా నిర్ధరించారు. అరుణ బీటెక్ పూర్తి చేసింది. అక్టోబరు 27న సమీప బంధువుతో అమెకు నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 19న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పనుల కోసం ఆమె తల్లిదండ్రులు కర్నూలుకు వెళ్లిన సమయంలో అరుణ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు నుంచి సమాచారం అందగానే ఆమె తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరో రెండు వారాల్లో పెళ్లి కావాల్సిన కుమార్తె చనిపోయిందంటూ తీవ్రంగా రోదించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.