
శ్రీనగర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బఘాట్ ప్రాంతంలో పోలీసులపై ఓ ముష్కరుడు బహిరంగంగా అందరూ చూస్తుండగానే కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దుస్తుల్లో తుపాకీని దాచుకొని వచ్చిన ఉగ్రవాది అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ కాల్పుల్లో సొహైల్ అనే కానిస్టేబుల్ ఘటనా స్థలంలో మృతిచెందగా.. మహ్మద్ యూసుఫ్ అనే మరో కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయం రోడ్డులో ఉగ్రవాది కాల్పులకు తెగబడటం కలకలం రేపింది. దీంతో ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు.. దుండగుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.
గత మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోఘటన. అత్యంత భద్రత ఉండే దుర్గనాగ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ యజమాని కుమారుడిపై బుధవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అతడికి గాయాలయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు 24మంది దౌత్యప్రతినిధుల బృందం పర్యటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.