
Kerala: పోలీసులపై 300 మంది వలస కార్మికుల దాడి!
కోచి: మద్యం మత్తులో 300 మంది వలస కార్మికులు పోలీసులపై దాడి చేసిన ఘటన కేరళలోని కోచిలో చోటుచేసుకుంది. కిళక్కంబల్లం ప్రాంతంలో కైటెక్స్ సంస్థలో పనిచేస్తున్న వలస కార్మికులు క్రిస్మస్ సందర్భంగా వేడుకలు జరుపుకొన్నారు. అందులో భాగంగా కార్మికులంతా మద్యం సేవించారు. మద్యం మత్తులో కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వారిని అదుపు చేసేందుకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటివరకు తమలో తాము కొట్టుకున్న కార్మికులు.. ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. సుమారు 300 మంది కార్మికులు.. పోలీసులపై దాడికి దిగారు. రెండు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. అకస్మాత్తుగా కార్మికులు దాడి చేయడంతో పోలీసులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ దాడిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షాజహాన్ సహా అయిదుగురు పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులను వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రూరల్ ఎస్పీ నేతృత్వంలో 500 మంది పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 150 మంది కార్మికులను అరెస్టు చేశారు. ఘర్షణ తలెత్తిన ప్రాంతంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.
► Read latest Crime News and Telugu News