Crime News: అట్టిక గోల్డ్‌ కంపెనీలో భారీ చోరీ.. ఫిర్యాదు అందిన 2గంటల్లోనే కేసు కొలిక్కి

బందరు రోడ్డులోని అట్టిక బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.60లక్షల నగదు,

Updated : 11 Dec 2021 20:04 IST

విజయవాడ: బందరు రోడ్డులోని అట్టిక బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.60లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, కేజిన్నర వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దుకాణంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోన్న శిరికొండ జయచంద్రశేఖర్‌ చోరీకి పాల్పడినట్టు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా మీడియాకు తెలిపారు. వేలి ముద్రలు, సీసీ కెమెరా దృశ్యాలు, తాళం పగలగొట్టిన విధానం ఆధారంగా చేసుకొని నిందితుడ్ని గుర్తించినట్టు చెప్పారు. మొత్తం నగదు, ఆభరణాలను మీడియా ముందు ప్రదర్శించారు.

విజయవాడ కృష్ణలంకకు చెందిన జయచంద్రశేఖర్‌ అట్టిక బంగారం దుకాణంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. గత 45 రోజులుగా ఎక్కువ నగదు ఉన్న సమయంలో చోరీకి పాల్పడేందుకు నిందితుడు ప్రణాళిక రూపొందించుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీపీ వెల్లడించారు. నకిలీ తాళాలు ఉపయోగించి 10వ తేదీ రాత్రి 1.30గంటల సమయంలో నిందితుడు ముందస్తు పథకం ప్రకారం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా లాకరు తెరిచి అందులోని నగదు, ఆభరణాలను రెండు సంచుల్లో భద్రపరిచాడు. చోరీ అనంతరం తాళం పగలగొట్టడంతో పాటు సీసీ కెమెరాపై దుప్పటి కప్పేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో వేలిముద్రలు సీసీ కెమెరాపై నమోదయ్యాయన్నారు. చోరీ సొత్తును తన మిత్రుడి ఇంట్లో పెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా తిరిగి యథావిధిగా విధులకు హాజరయ్యాడని చెప్పారు. అట్టిక దుకాణం యాజమాన్యం చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో నిందితుడు చంద్రశేఖర్‌ కూడా దుకాణంలోనే ఉన్నారని సీపీ వివరించారు. తమకు అందిన ఫిర్యాదుపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారని, డీసీపీ హర్షవర్దనరాజు, ఏడీసీపీలు కె.శ్రీనివాసరావు, ఖాదర్‌బాబు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘటనాస్థలాన్ని పరిశీలించి పూర్తి ఆధారాలు సేకరించారని వివరించారు. ఇంటి దొంగల పనేనని నిర్ధారణకు వచ్చి సిబ్బందిని ప్రశ్నించి.. సీసీ కెమెరాలు పరిశీలించగా చంద్రశేఖర్‌ చోరీకి పాల్పడినట్టు నిగ్గు తేలిందన్నారు. తక్కువ సమయంలో చురుగ్గా కేసు దర్యాప్తు చేసి నిందితుడ్ని, నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని సీపీ కాంతిరాణా అభినందించారు. బంగారు దుకాణాల భద్రత విషయంలో వాటి నిర్వాహకులతో త్వరలోనే సమావేశం నిర్వహించి తగిన సూచనలు చేస్తామని సీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని