మోదీ ర్యాలీకి వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీకి హాజరు కావాలని బయలుదేరిన కార్యకర్తలకు మార్గంమధ్యలోనే  ప్రమాదం జరిగింది.  47 మందితో వెళుతున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు.  12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 22 Feb 2024 14:38 IST

రాయ్‌పుర్‌: ప్రధాని నరేంద్రమోదీ ర్యాలీకి హాజరు కావాలని ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన కార్యకర్తలకు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. 47 మందితో వెళుతున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం రాయ్‌పుర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ జరగనుంది. దీనికి హాజరు కావడానికి అంబికాపుర్‌ నుంచి 47 మంది కార్యకర్తలు శుక్రవారం ఉదయం బస్సులో రాయ్‌పుర్‌కు బయలుదేరారు. బిలాస్‌పుర్‌కు చేరుకొని బస్సు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. 12 మందికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను  చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  డ్రైవరు నిద్రమత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.

ప్రమాదంపై ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.  మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని