East Godavari: అర్ధరాత్రి ఇంటికెళ్లి ప్రియుడిని చంపిన ప్రియురాలు

నాలుగేళ్ల పాటు ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడ్ని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి మరీ ప్రియురాలు హత్య చేసిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

Updated : 11 May 2023 19:09 IST

రాజమహేంద్రవరం: ప్రేమించిన ప్రియుడిని ప్రియురాలే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో కలకలం రేపింది. నాలుగేళ్ల పాటు ప్రేమించి ముఖం చాటేసిన ప్రియుడ్ని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి మరీ హత్య చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తిరుమలపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు(26) గ్రామంలో చిన్నపాటి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబొర రాజమహేంద్రవరంలో చదువుతున్న సమయంలో నాగశేషుతో పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఇరువురు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అయితే, నాగశేషు కుటుంబ సభ్యులు ఏడాది క్రితం గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన యువతితో అతడికి వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని ప్రియురాలి వద్ద దాచి ఉంచాడు. ఇటీవల ప్రియురాలికి విషయం తెలియడంతో పలుమార్లు నాగశేషుతో గొడవపడింది. ఈ నేపథ్యంలో ఆ యువతి తన స్నేహితుడు రాజవొమ్మంగి మండలం దూసరపాముకు చెందిన శివన్నారాయణతో కలిసి బుధవారం అర్ధరాత్రి నాగశేషు ఇంటికి వెళ్లింది. 

డాబాపై నిద్రిస్తున్న నాగశేషు వద్దకు వెళ్లి నిద్రలేపి గొడవకు దిగింది. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తిపేటతో అతడిపై దాడి చేసింది. ఆమెతో పాటు వచ్చిన యువకుడు కర్రతో కొట్టాడు. కేకలు వినిపించడంతో స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నాగశేషును అంబులెన్స్‌లో రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు విడిచాడు. డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు, సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్సై శివనాగబాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని