logo

కార్పొరేట్‌ హంగులు.. సకల సౌకర్యాలు

బడి అంటేనే భవిష్యత్తుకు బాటలు వేసే గుడి. పిల్లలు ఆనందంగా, ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునే ప్రదేశం. పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదవాలన్నా.. ఉత్తమ ఫలితాలు సాధించాలన్నా ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ హంగులతో సమకూరుతున్నాయి.

Updated : 07 Jun 2023 06:00 IST

ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు

ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులు

దండేపల్లి, న్యూస్‌టుడే: బడి అంటేనే భవిష్యత్తుకు బాటలు వేసే గుడి. పిల్లలు ఆనందంగా, ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునే ప్రదేశం. పిల్లలు ఆంగ్ల మాధ్యమం చదవాలన్నా.. ఉత్తమ ఫలితాలు సాధించాలన్నా ఇందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ హంగులతో సమకూరుతున్నాయి. ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారు. ఎన్నో  సౌకర్యాలు.. సుశిక్షుతులైన ఉపాధ్యాయులు.. ప్రత్యేక తరగతుల నిర్వహణతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.

చేరికలే లక్ష్యంగా బడిబాట

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు, ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ.. సర్కారు బడిలో చేర్పించేందుకు ఈనెల 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బడి బాట నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలను వివరిస్తూ తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగిస్తున్నారు.

భవితకు బాసట

ప్రతిభ గల విద్యార్థులకు కేంద్రం జాతీయ మాధ్యమిక ప్రతిభా ఉపకార వేతనాలు అందిస్తోంది. ఎంపికైన ఒక్కో విద్యార్థికి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఏడాదికి రూ. 12 వేల చొప్పున అందజేస్తున్నారు. ఇలా ఏటా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మందిని పరీక్ష ద్వారా ఎంపిక చేసి నాలుగేళ్లు ఉపకార వేతనాలు అందిస్తున్నారు. ప్రతిభతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికి అయిదు నుంచి పదో తరగతి వరకు 9, 10 తరగతులు చదివే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తున్నారు.

ఏకరూప దుస్తులు.. మధ్యాహ్న భోజనం

ప్రతీ విద్యార్థికి రెండు జతల ఏకరూప దుస్తులు అందజేయడంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఆకుకూరలు, పప్పులతో పాటు వారానికి మూడు రోజులు కోడిగుడ్డు, అందజేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వెజ్‌బిర్యాని, తదితర పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు.

ప్రయాణ భత్యం

దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రయాణ భత్యం అందిస్తోంది. మూడు కిలో మీటర్ల కన్నా దూరం నుంచి వచ్చే ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఏడాదికి రూ. 6 వేలు, కిలో మీటరు కన్నా దూరం నుంచి వచ్చే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ. 3 వేల నగదు అందిస్తున్నారు.

మేథ.. ప్రతిభకు అండ

చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి చుంచు విష్ణువర్ధన్‌. పదోతరగతి వరకు వెల్గనూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి మేథ ట్రస్టు నిర్వహించిన పరీక్షలో మంచి మార్కులు రావడంతో హైదరాబాద్‌లోని సీఎస్‌ఈ బీటెక్‌ కళాశాలలో చేరి ఇటీవలే చివరి సంవత్సరం పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్‌ ఆతర్వాత బీటెక్‌, ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఇలా ఆరు సంవత్సరాల పాటు ఉచితంగా విద్యను అందిస్తారు. ఉచిత వసతి, దుస్తులు, రవాణాభత్యం సైతం అందిస్తోంది. సర్కారు బడుల్లో చదివే పేద ప్రతిభావంతులకు ఇది మంచి అవకాశం.

ప్రయోగాలతో పాఠాలు

* ప్రయోగాలతో పాఠాలు బోధించేందుకు అవసరమైన ల్యాబ్‌ సౌకర్యం

* అన్ని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధన

* మంచి జీపీఏ సాధిస్తే ప్రైవేటు కార్పొరేట్‌ కళాశాలల్లోనూ ఉచితంగా చదువుకోవచ్చు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ  ఉమ్మడి జిల్లాలో ఏటా 200 మందికి ఉచితంగా ఇందులో చదివే అవకాశాన్ని కల్పిస్తోంది.

* ట్రిపుల్‌ ఐటీలో ప్రాధాన్యం.

* ఉచితంగా పాఠ్యపుస్తకాలు..ఈఏడాది నుంచి నోటు పుస్తకాలను అందజేయనున్నారు

అందుబాటులో అధునాతన వసతులు

పాఠశాలల్లో అన్ని హంగులతో కూడిన సౌకర్యాలు కల్పించేందుకు గతేడాది మన ఊరు-మన బడి ప్రారంభించారు. ఇప్పటికే మొదటి విడతగా మంజూరైన  పాఠశాలల్లో పనులు పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి. ప్రహరీ, తరగతి గదులు, డ్యూయెల్‌ డెస్క్‌ బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, డిజిటల్‌ బోధన వసతి తదితర అన్ని హంగులు కల్పిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి ఫలితాలు

 ఎస్‌.యాదయ్య, జిల్లా విద్యాధికారి, మంచిర్యాల

సర్కారు పాఠశాలల్లో ప్రభుత్వం ఉపకార వేతనాలు, ఏకరూప దుస్తులు ఇలా ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోంది. మన ఊరు-మన బడి ద్వారా కార్పొరేట్‌ హంగులతో ఆకర్షణీయంగా మారాయి. మంచి ఫలితాల సాధనకు ప్రత్యేక తరగతులు, డిజిటల్‌ బోధన సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడే చేర్చితే భవిష్యత్తు బాగుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని