logo

Ganesh Chaturthi: కుభీరు ఉత్సవాలకు 119 ఏళ్లు!

దేశ స్వాంతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమ కాలమది. భారతీయులు ఐక్యం కాకూడదనే కుట్రలతో ఆంగ్ల పాలకులు ఎక్కడికక్కడ ఆంక్షలు ఉండేవి.

Updated : 26 Sep 2023 10:09 IST

తెలంగాణలో మొదటి గణపతి అక్కడే..
బాలగంగాధర్‌ తిలక్‌ ప్రేరణతో ప్రారంభం

సార్వజనిక్‌ గణేశ్‌ మండపంలో కర్ర వినాయకుడు

భైంసా, న్యూస్‌టుడే: దేశ స్వాంతంత్య్రం కోసం పోరాడుతున్న ఉద్యమ కాలమది. భారతీయులు ఐక్యం కాకూడదనే కుట్రలతో ఆంగ్ల పాలకులు ఎక్కడికక్కడ ఆంక్షలు ఉండేవి. అదే సమయంలో భారతీయులను ఏకతాటికి తీసుకొచ్చి పోరాటాన్ని ఉద్ధృతం చేసేందుకు జాతీయ నాయకులు కృషి చేస్తున్నారు. అప్పట్లో తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతంలోని 16జిల్లాలు నిజాం నవాబు పాలనలో ఉండేవి. నాందేడ్‌ జిల్లాలోని ముథోల్‌ తాలూకా అందులో భాగమే. దేశాన్ని ఆంగ్లేయుల నుంచి విముక్తి కల్పించే లక్ష్యంతో ప్రజలను సంఘటితం చేసేందుకు స్వాతంత్య్ర పోరాటయోధుడు బాలగంగాధర్‌ తిలక్‌ 1853లో మహారాష్ట్ర పుణేలో వినాయక ఉత్సవాలను(Ganesh Chaturthi) ప్రారంభించారు.

కార్యక్రమాలను విస్తృతం చేసే పర్యటనలో భాగంగా.. ఆయన అమరావతి నుంచి రైలు మార్గాన ధర్మాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి 1905 ఏప్రిల్‌ 2న ఎడ్లబండిపై కుభీరుకు వచ్చారు. బంధువైన కుభీరు దొర యశ్వంత్‌రావు దేశ్‌ముఖ్‌ను కలుసుకుని 16ఎకరాల విస్తీర్ణంగల దొడ్డి(బురుజు)లో యశ్వంత్‌రావు దేశ్‌ముఖ్‌, భైంసాకు చెందిన నారాయణ్‌రావు వాఘేతో గణేశ్‌ ఉత్సవాలపై సమాలోచనలు చేశారు. అప్పటికే స్వాతంత్య్రం పోరాట కాంగ్రెస్‌లో బాబురావు జోషి, సుభేదార్‌ గంగారాం, రాములు అడెల్లు, బోడ్కే నాగనాథ్‌ అనే చురుకైన యువకులు ప్రేరేపితమయ్యారు. దేశ్‌మేఖ్‌ ఆధ్వర్యంలో 1905లో కుభీరులోని విఠలేశ్వర ఆలయంలో రహస్యంగా సుద్ద మట్టితో వినాయకుని తయారు చేసి ప్రతిష్ఠించారు. భజనల మాటున నవరాత్రులు పూర్తి చేసి సమీప వాగులో నెత్తిమీద మోసుకెళ్లి నిమజ్జనం చేసేవారు. విషయం తెలుసుకున్న నిజాం నిరంకుశులు అడ్డుకున్నారు. దీంతో యువకులు ముథోల్‌లోని నిజాం తహసీల్దారు అనుమతి కోసం వెళ్తే నానా తిప్పలు పెట్టేవారు. ఇలా నిర్బంధాల మధ్య ఏర్పాటు చేసిన కుభీరు గణేశ్‌ ఉత్సవాలకు 119 ఏళ్లైంది. మొదట 21జతల ఎడ్లతో కట్టిన బండిపై డప్పుచప్పుళ్లు, సంప్రదాయ భజనలతో శోభాయాత్ర నిర్వహించే వారు. కాగా 35 సంవత్సరాల నుంచి పీవోపీ విగ్రహాలు, వాహనాలపై తీసుకెళ్తున్నారు. పర్యావరణరీత్యా గత పది సంవత్సరాల కిందట కర్ర వినాయకున్ని తయారు చేయించి ఏటా అదే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. నిమజ్జనం రోజున వాగు వరకు తీసుకెళ్లి నీళ్లు చిలకరించి తిరిగి భద్రపరుస్తున్నారు.\

అప్పట్లో గణపతిని నిమజ్జనానికి  తరలిస్తూ.. 


ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు

జైహింద్‌ కాలంలో(స్వాతంత్య్ర ఉద్యమం) అటు అంగ్రేజీ వాళ్లు, ఇటు నిజాం సర్కారోళ్లు అనేక ఇబ్బందులు పెట్టేవారు. మా అన్నలు, ఇంకా కొందరు పెద్దలు స్వాంతంత్య్రం కోసం కాంగ్రెస్‌లో ఉండి పోరాడారు. గణేశ్‌ ఉత్సవాలను బాలగంగాధర్‌ తిలక్‌ కుభీరు వచ్చిన సంవత్సరమే మా అన్న నాగనాథ్‌, బాబురావు జోషి, రాములు, సుభూదార్‌ గంగారాంతో పెద్దలు దొంగచాటున విఠలేశ్వరుని మందిరంలో ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఏటా కొనసాగుతున్నాయి. యశ్వంత్‌రావు కుటుంబం నాందేడ్‌, ఔరంగాబాదులో స్థిరపడ్డారు. అప్పుడు ప్రజల ఐక్యత కోసం ఏక్‌ గావ్‌, ఏక్‌ గణపతి అని ఉండేది. ఇప్పడు వీధికో మండలి ఏర్పాటు చేస్తున్నారు.

బోడ్కే వైజ్యనాథ్‌, కుభీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని