logo

ఆదివారం పెళ్లి.. అంతలోనే విషాదం

ఆ ఇంట్లో ఆదివారం పెళ్లి వేడుకలు జరగాల్సి ఉండగా ఇంతలోనే విషాదం అలముకుంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి తనకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకున్న యువకుడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

Updated : 15 Feb 2024 09:45 IST

మిరాల వినోద్‌

కడెం, న్యూస్‌టుడే: ఆ ఇంట్లో ఆదివారం పెళ్లి వేడుకలు జరగాల్సి ఉండగా ఇంతలోనే విషాదం అలముకుంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి తనకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకున్న యువకుడు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈలోపే విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాల్‌లో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబెల్లాల్‌కు చెందిన మిరాల నీలయ్య, కళావతి దంపతుల మూడో సంతానమైన మిరాల వినోద్‌(25) నాలుగేళ్లపాటు దుబాయి వెళ్లి డబ్బులు పంపిస్తే కుటుంబ సభ్యులు ఇల్లు నిర్మించారు. వినోద్‌ అయిదారు నెలలక్రితమే స్వగ్రామానికి వచ్చి ఇంటి పనులు పూర్తిచేయించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 18న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి కావాల్సిన పనులు చేస్తూ ఇంటివద్ద మధ్యాహ్నం వరకు పనిచేసిన వినోద్‌ స్నానానికి గదిలోకి వెళ్లారు. విద్యుత్తు గీజర్‌ ఆన్‌చేసి నీటిని పట్టుకునేందుకు నల్లా తిప్పారు. స్టీల్‌ నల్లా కావడంతో గీజర్‌ ద్వారా నీటితో విద్యుదాఘాతం సంభవించి కేకలు వేశారు. గది తలుపు మూసి ఉండడంతో కుటుంబ సభ్యులు తలుపు బద్దలు కొట్టి బయటకు తీసి ఖానాపూర్‌ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో విషాదం నిండటంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఏఎస్సై దేవ్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని